అమరావతి : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేశ్ బుధవారం ఇంటర్ ఫలితాలను ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. గత 12 ఏళ్లలో తొలిసారి రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫస్టియర్‌లో 5,10,307 మంది, సెకండియర్‌లో 5,05,609 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 77శాతం, ద్వితీయ సంవత్సరం పరీక్షలలో 81శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ లో 54శాతం, సెంకండియర్ లో 68 శాతం ఉత్తీర్ణతతో సాధించారు. ఏపీ ఇంటర్ ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరం అమ్మాయిల పాస్ శాతం 85% ఉంటే, ప్రథమ సంవత్సరం అమ్మాయిల పాస్ శాతం 81% గా ఉంది.
ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు. ఫలితాలను https://resultsbie.ap.gov.in లోనూ చూసుకోవచ్చని, అలాగే మనమిత్ర ద్వారా ‘Hi’ మెసేజ్‌ను 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో పంపితే కూడా ఫలితాలు వాట్సప్‌లోనూ పొందొచ్చని మంత్రి పేర్కొన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందవద్దని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తిరిగి కృషి చేసి విజయం సాధించాలని వారికి పిలుపు ఇచ్చారు. ఈ సమయంలో తల్లిదండ్రులు విద్యార్థులకు మానసిక బలం ఇవ్వాలని, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని విజయాలు సాధించాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.
ఇంటర్ ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఏప్రిల్ 20- 27 వరకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మే 21 నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (రెండు సెషన్లలో) ఉంటాయని, జూన్ 7 నుంచి 11 వరకు జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
పరీక్ష ఫీజును ఏప్రిల్ 20 నుంచి 27వరకు కాలేజీల్లోనే చెల్లించుకోవచ్చన్నారు.
కృష్ణా టాప్.. అన్నమయ్య జిల్లా లాస్ట్
ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. అన్నమయ్య జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. ద్వితీయ ఇంటర్‌లో కృష్ణా 92 శాతం, గుంటూరు 88%, ఎన్‌టీఆర్ జిల్లా 87శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలవగా.. అన్నమ్య జిల్లా 67శాతంతో ఆఖరి స్థానంలో ఉంది. ప్రథమ ఇంటర్‌లో కృష్ణా (90%), గుంటూరు (88%), విశాఖ (85%) అగ్రస్థానంలో నిలవగా.. అన్నమయ్య జిల్లా 77శాతంతో ఆఖరి స్థానంలో ఉంది.
