Site icon vidhaatha

కొత్త టెండ‌ర్ల‌తో వెయ్యికోట్లు లాభం


విధాత‌, హైద‌రాబాద్‌: గ‌తేడాది అకాల వ‌ర్షాల‌తో త‌డిచిన ధాన్యం విక్ర‌యాల్లో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు వెయ్యి కోట్ల‌కు పైగా న‌ష్టం వాటిల్లే విధంగా గ‌త బీఆరెస్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింద‌ని ఆ శాఖ‌లోని ఉన్న‌తాధికారులు దృవీక‌రించారు. మెట్రిక్ ట‌న్నుకు రూ.3 వేల కంటే త‌క్కువ‌కు టెండ‌ర్ క‌ట్ట‌బెట్టినా కొనుగోలుదారులు మాత్రం వాటిని కూడా చెల్లించేందుకు ఇష్ట‌ప‌డ‌లేదని వెల్ల‌డించారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎమ్మెస్పీ) ప్ర‌కారం మెట్రిక్ ట‌న్ను ధాన్యం ధ‌ర రూ.20,600. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో టెండ‌ర్లు పిలిచి మెట్రిక్ ట‌న్నుకు రూ.17,015.19కు ఖ‌రారు చేశారు. ఆ లెక్క‌న 34.59 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ.5,885.55 కోట్లు రావ‌ల్సి ఉన్న‌ది.


ఎమ్మెస్పీ ప్ర‌కారం చూస్తే రూ.1,239.99 కోట్లు శాఖ న‌ష్ట‌పోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. తాజా టెండ‌ర్ల‌లో మెట్రిక్ ట‌న్నుకు రూ.20,225.67కు టెండ‌ర్ దాఖ‌లైంది. పాత టెండ‌ర్‌తో పోలిస్తే ఇది ఒక్కో మెట్రిక్ ట‌న్నుకు రూ.3,210.48 అద‌నం. ఈ లెక్క‌న మొత్తం 34.59 లక్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు తాజా టెండ‌ర్ ప్ర‌కారం రూ.6,996.06 కోట్లు రాబ‌డి స‌మ‌కూర‌నుందంటున్నారు. పాత టెండ‌ర్ల రాబ‌డితో పోలిస్తే ఇది రూ.1,110.51 కోట్లు అద‌నం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పాత‌ టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసి, కొత్తగా టెండ‌ర్ల‌కు పిలిచారు. దీంతో గ‌తం క‌న్నా ఒక్కో మెట్రిక్ ట‌న్నుకు రూ.3 వేలు అద‌నంగా టెండ‌ర్లు దాఖ‌ల‌య్యాయని అధికారులు స్ప‌ష్టం చేశారు.

Exit mobile version