Vietnam | మంటల్లో 10 అంతస్థుల భవనం.. 12 మంది సజీవ దహనం
Vietnam దవాఖానలో 74 మంది క్షతగాత్రులు 70 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది వియత్నాం రాజధానిలో ఘటన విధాత: వియత్నాం రాజధాని హనోయ్‌లోని పది అంతస్థుల భవనం మంటల్లో చిక్కుకున్నది. మంగళవారం అర్ధరాత్రి చెలరేగిన మంటల్లో డజన్ మందికిపైగా చనిపోయినట్టు అధికారవర్గాలు బుధవారం వెల్లడించాయి. పది అంతస్థుల భవనంలోని పార్కింగ్ ఫ్లోర్‌లో తొలుత మంటలు ప్రారంభమైనట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే, మంటలు చెలరేగడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అపార్ట్‌మెంట్ నుంచి సహాయ సిబ్బంది 70 […]

Vietnam
- దవాఖానలో 74 మంది క్షతగాత్రులు
- 70 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది
- వియత్నాం రాజధానిలో ఘటన
విధాత: వియత్నాం రాజధాని హనోయ్‌లోని పది అంతస్థుల భవనం మంటల్లో చిక్కుకున్నది. మంగళవారం అర్ధరాత్రి చెలరేగిన మంటల్లో డజన్ మందికిపైగా చనిపోయినట్టు అధికారవర్గాలు బుధవారం వెల్లడించాయి.
పది అంతస్థుల భవనంలోని పార్కింగ్ ఫ్లోర్‌లో తొలుత మంటలు ప్రారంభమైనట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే, మంటలు చెలరేగడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అపార్ట్‌మెంట్ నుంచి సహాయ సిబ్బంది 70 మందిని సురక్షితంగా రక్షించారు. గాయపడిన మరో 74 మందిని దవాఖానకు తరలించారు.
మంగళవారం అర్ధరాత్రి మొదలైన మంటలు బుధవారం ఉదయం వరకు కొనసాగాయని స్థానిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. నైరుతి హనోయిలోని నివాస ప్రాంతాలు అధికంగా ఉండే అపార్ట్‌మెంట్‌లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది.
ఘటనా స్థలానికి చేరుకొనేందుకు ఇరుకైన సందు మాత్రమే ఉండటంతో మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఫైర్, సహాయ సిబ్బంది చాలా కష్టపడాల్సి వస్తున్నది. సహాయ చర్యలు ఆలస్యం కావడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి కారణమైనట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.
అపార్ట్‌మెంట్ మూసివేయబడినట్టు ఉండటం, తప్పించుకొనే మార్గం లేకపోవడంతో బాధితులు బయటకు రాలేక పొగతో ఊపిరి ఆడక చనిపోయినట్టు తెలిపాయి. గత ఏడాది వాణిజ్య కేంద్రం హోచి మిన్ సిటీలోని మూడు అంతస్థలు ఉన్న ఓ బార్‌లో మంటలు చెలరేగడంతో 32 మంది మరణించారు.