Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ ఆలస్యమైందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని దర్శకుడు హరీష్ శంకర్ చెప్పారు. పవన్ కళ్యాణ్–హరీష్ శంకర్ కాంబినేషన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రంపై వస్తున్న పుకార్లకు ఆయన తెరదించారు. రాజమండ్రిలో ఈ సినిమా తొలి పాట ‘దేఖ్ లేంగే సాలా’ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ శంకర్, పాటతో పాటు సినిమా ఆలస్యానికి గల అసలు కారణాలను వివరించారు.
రోజుకు 18–20 గంటలు పనిచేసిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ తమను ఊపిరి ఆడనివ్వకుండా షూటింగ్ చేశారని హరీష్ శంకర్ అన్నారు. “ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఒక వైపు ప్రజాసేవ చేస్తూ, మరోవైపు సినిమాకు పూర్తి న్యాయం చేశారు. ఉదయాన్నే కేబినెట్ సమావేశం ఉందని విజయవాడ వెళ్లేవారు. రెండు రోజులు షూటింగ్ ఉండదేమో అనుకుంటే… అదే రోజు రాత్రి హైదరాబాద్ వచ్చి షూటింగ్‌లో పాల్గొనేవారు. ఉదయం ప్రజాసేవలో ఉండి, రాత్రి ఫ్లయిట్‌లో వచ్చి తెల్లవారుజామున మూడు, నాలుగు గంటల వరకూ షూటింగ్ చేసి మళ్లీ మంగళగిరి వెళ్లిన రోజులు ఉన్నాయి. రోజుకు 18 నుంచి 20 గంటలు ఆయన పని చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాకు ఆయన ప్రాణం పెట్టారు. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెబుతున్నా” అని హరీష్ శంకర్ భావోద్వేగంగా తెలిపారు.
అలాగే, “ప్రయత్నంలో లోపం ఉండకూడదని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెబుతారు. ఆయన ప్రయత్నంలో లోపం లేకపోవడం వల్లే అపజయాలను దాటి, ఈ రోజు ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు” అని ప్రశంసించారు.
ఆలస్యానికి అసలు కారణం అదే
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆలస్యం పవన్ కళ్యాణ్ వల్ల కాదని, సినిమా ప్రయాణంలో తాను ఎదుర్కొన్న సందిగ్ధతలే కారణమని హరీష్ శంకర్ వివరించారు. “మొదట కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రేమకథ చేయాలనుకున్నా. కానీ అభిమానులు ‘గబ్బర్ సింగ్’ తరహా సినిమా కోరడంతో అయోమయంలో పడ్డా. అదే సమయంలో కరోనా వచ్చింది. ఆ సమయంలో నేను కొంత డిప్రెషన్‌లోకి వెళ్లాను. పవర్ స్టార్‌కు ఏ కథ సరైనదో నిర్ణయించుకోవడంలో కొంత సమయం వృథా అయ్యింది. ఒక రీమేక్ అనుకుని అది కూడా పక్కన పెట్టాం. ఆలస్యమైనా సరే, అభిమానులు మళ్లీ మళ్లీ చూసే సినిమా చేయాలనే ఉద్దేశంతో మా టీమ్ అంతా కలిసి పని చేశాం. నిజానికి పవన్ కళ్యాణ్ వల్లే షూటింగ్ త్వరగా పూర్తైంది” అని చెప్పారు.
దేవి శ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్‌పై ప్రశంసలు
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని హరీష్ శంకర్ చెప్పారు. “‘ఆనందం’ సినిమా చూసినప్పటి నుంచే ఆయనతో ఒక్కసారైనా పని చేయాలనుకున్నా. దేవుడు మూడుసార్లు ఆ అవకాశం ఇచ్చాడు. ఇప్పటికీ మొదటి సినిమాలా అదే ఉత్సాహంతో దేవి పని చేస్తారు” అని తెలిపారు.అలాగే నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలిలను కూడా ఆయన ప్రశంసించారు. “అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు. వారి సహకారం వల్లే ఈ సినిమా ఇంత గ్రాండ్‌గా రూపుదిద్దుకుంటోంది” అని అన్నారు. మొత్తంగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆలస్యంపై సాగుతున్న పుకార్లకు హరీష్ శంకర్ స్పష్టమైన వివరణ ఇచ్చి, పవన్ కళ్యాణ్ సినిమాపై చూపిన కమిట్‌మెంట్‌ను మరోసారి హైలైట్ చేశారు.
