విధాత, హైదరాబాద్ : నెట్‌ఫ్లిక్స్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ ను భారత్ ఫ్యూచర్ సిటీకి తీసుకువస్తే.. అవసరమైన స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హైటెక్‌సిటీలోని నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన అతిపెద్ద ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలను హైదరాబాద్ నుంచి కార్యకలాపాలను నిర్వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, నెట్‌ఫ్లిక్స్ సైతం కార్పొరేట్ కార్యాలయాన్ని ఈ మహానగరానికి మార్చుకోవాలని కోరారు. తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. నెట్ ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభంతో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో హైదరాబాద్ విప్లవాత్మకమైన మార్పులకు వేదిక కానుందన్నారు. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చేసిందంటే హాలివుడ్ వచ్చేసినట్లేనన్నారు.
నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం అని, సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి అని, ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుంచి టెక్నోకలర్, అక్కడి నుంచి ఈస్ట్‌మన్ కలర్, తర్వాత 70 ఎంఎం, డాల్బీ, అక్కడి నుంచి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఎదిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు బాహుబలి, కల్కి, ఆర్ ఆర్ ఆర్, అరుంధతి వంటి అత్యనున్నత సాంకేతికతో కూడిన సినిమాలు టాలీవుడ్ లో వచ్చాయని గుర్తు చేశారు. చెన్నై లో ఉన్న సినిమాను ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్ కు తీసుకు వచ్చారు అన్నారు. ఈ ప్రాంతం టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ రావాలని ఎప్పుటినుంచో బలంగా కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఫార్చూన్ 500 కంపెనీలు హైదరాబాద్‌లో ఏర్పాటు కావాలన్నది మా ఆకాంక్ష. 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. మీ పెట్టుబడులకు అన్ని విధాలుగా రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు.
నెట్ ఫ్లిక్స్ ప్రపంచానికి వినోదం అందించాలని చూస్తోంది. మేం ప్రపంచాన్ని సుసంపన్నం చేయాలని చూస్తున్నాం. మీకూ మాకు మధ్యన సారూప్యత ఉంది. నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ ప్రపంచంలోని అన్ని సంస్కృతులను ప్రజలను ఆహ్వానిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ రెండూ గేట్‌వేలుగా పనిచేయడానికి దోహదపడుతాయి అని రేవంత్ రెడ్డి తెలిపారు.
డీవీడీలను అద్దెకు సమకూర్చే స్థాయి నుంచి ఓటీటీ లో ప్రపంచ లీడర్‌గా నెట్‌ఫ్లిక్స్ ఎదిగింది. ఫుడ్, ట్రావెల్, వారసత్వం, సంస్కృతి విషయాల్లో ప్రజలు నెట్‌ఫ్లిక్స్‌ను, హైదరాబాద్‌ను ప్రేమిస్తారు. ప్రపంచ వీక్షకులకు తెలంగాణను విశ్వవ్యాప్తం చేయడంలో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ ఫెసిలిటీ ఎంతో ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ మీద దృష్టిని సారించింది. స్పోర్ట్స్‌లో ఈ సంస్థ అతిపెద్ద బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ కాబోతుంది అని రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని స్థాయిల్లో ట్యాలెంట్‌ను గుర్తించాలన్న లక్ష్యంతో క్రీడల పట్ల, క్రీడాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పింది. మీకూ మాకూ ఎంతో సారూప్యత కలిగిన నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ – హైదరాబాద్ రెండూ కలిసి మంచి విజయాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. భారత్, తెలంగాణ భవిష్యత్తులో ప్రపంచస్థాయి వినోదాన్ని అందిస్తాయనడానికి ఈ కార్యక్రమమే ఒక నిదర్శనం. మనం కలిసి భవిష్యత్తుపై బలమైన ముద్ర వేద్దాం…” అని పిలుపునిచ్చారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐలైన్ స్టూడియోస్ సీఈఓ జెఫ్ షపిరో, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, సినీ నటుడు, నిర్మాత రాణా దగ్గుబాటి, తెలంగాణ ఫిలిం డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Fake Doctor At Yashoda Hospital : యశోదా హాస్పిటల్ లో ఫేక్ డాక్టర్ కలకలం!
Costly Marriages | కోట్ల ఖర్చుతో గ్రాండ్‌గా జరిగిన సెలబ్రిటీల పెళ్లిళ్లు…. భారత్‌లో అత్యంత ఖరీదైన సెలబ్రిటీ వివాహాలు ఇవే!
