ఒకే తరహా పథకాలు..ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాల పురోగమనం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమ పథకాలలో ఒకే తరహా నిర్ణయాలతో ముందుకెళ్తున్నాయి. భారీ ప్రాజెక్టులు, నగర అభివృద్ధి పనుల్లో కూడా సమాన పోటీ కనిపిస్తోంది.

Telugu states

విధాత : రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్దిలో పోటీ పడటం మాటేమోగాని..పరిపాలన నిర్ణయాలు.. సంక్షేమ, అభివృద్ది పథకాలు..ప్రాజెక్టులు వంటి అంశాలలో మాత్రం ఒకే తరహా నిర్ణయాలతో పురోగమిస్తున్నాయి. ఉచిత బస్సు, రైతులకు పెట్టుబడి సాయం, మహిళా, బాలిక సంక్షేమ పథకాలు వంటి పలు పథకాలు..ఎన్నికల హామీలు రెండు రాష్ట్రాలలో దాదాపుగా ఒకే తరహాలో అమలవుతున్నాయి. అభివృద్ధికి సంబంధించి.. తెలంగాణలో కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టు నిర్మిస్తే, ఏపీ పోలవరం నిర్మిస్తుండటంతో పాటు కొత్తగా నల్లమల సాగర్ లింక్ వంటి ప్రాజెక్టుల నిర్మాణంతో నదుల అనుసంధానం తలపెట్టింది. తెలంగాణకు ఇప్పటికే ఉన్న ప్రపంచ స్థాయి నగరం హైదరాబాద్, అందులో భారీ నూతన సచివాలయం ఉంటే..ఏపీలో అమరావతి వంటి ఆధునిక నగర నిర్మాణం చేపట్టారు. అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి పూనుకోగా..తెలంగాణలో స్పోర్ట్స్ సిటీ, ఫ్యూచర్ సీటీ నిర్మాణం తలపెట్టారు.

దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున సచివాలయం ఎదుట రూ.146.5 కోట్లు ఖర్చుతో 125 అడుగులతో ఏర్పాటు చేయగా, 11.8 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటైంది. ఏపీలో ఇదే తరహాలో అమరావతి(విజయవాడ) నగరం నడిబొడ్డున స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలోని అతి పెద్దదిగా.. 206 అడుగుల ఎత్తుతో రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసి ఏర్పాటు చేశారు. దాదాపుగా 19 ఎకరాల్లో ఈ విగ్రహంతో పాటు థీమ్ పార్కు, మ్యూజీయం, లైబ్రరీ ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ లో దుర్గం చెరువు వద్ద దేశంలోనే పెద్దదైన ఐకానిక్ తీగల వంతెనను రూ.184 కోట్ల వ్యయంతో 754 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఏపీలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని కృష్ణానదిపై ఐకానిక్‌ సస్పెన్షనబుల్‌ కేబుల్‌ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దేశంలోనే తొలి ఐకానిక్‌ సస్పెన్షనల్‌ కేబుల్‌ బ్రిడ్జిగా ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.1082.56కోట్లతో దీనిని నిర్మించనుండటం విశేషం. ఈ వంతెన మొత్తం పొడవు 2.3 కిలోమీటర్లు కాగా.. నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి ఏపీలోని ఆత్మకూరు వరకు నిర్మించనున్నారు.

తిరుపతి – హైదరాబాద్‌ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించే క్రమంలో కల్వకుర్తి నుంచి జమ్ములమడుగు వరకు ఎన్ హెచ్ -167కే జాతీయ రహదారి నిర్మాణంలో ఉంది. ఈ రహదారికి అనుసంధానంగా ఆంధ్రలోని సంగమేశ్వరం, తెలంగాణలోని సోమేశ్వరం కలుపుతూ కృష్ణానదిపై ప్రపంచంలోనే రెండవ, ఈ ఐకానిక్ వంతెన పూర్తయితే తిరుపతి – హైదరాబాద్‌ నగరాల నడుమ ప్రయాణ భారం సుమారు 80 కి.మీటర్లు తగ్గనుండటం గమనార్హం. తెలంగాణలో ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు ఉంటే…ఏపీలో వెలుగొండ సొరంగం ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది.

తెలంగాణలో గాంధీ సరోవర్..ఏపీలో తెలుగు సాంస్కృతిక కేంద్రం

తెలంగాణలో కొత్తగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో అమలులో భాగంగా తొలి దశలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బాపూఘాట్ వద్ద రూ. 400 కోట్లతో ‘గాంధీ సరోవర్ ప్రాజెక్టు’ను చేపట్టనుంది. బాపూఘాట్‌ వద్ద 150 మీటర్ల ఎత్తులో గాంధీ విగ్రహం నిర్మాణం కానుంది. మూసీ నదికి రెండు వైపులా విశాలమైన రోడ్లు, నది పొడవునా ఆకట్టుకునే పార్కులు ఏర్పాటు కానున్నాయి. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎంఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ తొలిదశ మూసీ సుందరీకరణ, మహాత్మాగాంధీ విగ్రహం, థీమ్ పార్కు, మ్యూజీయం వంటి నిర్మాణ నమూనాలను, అందులో అంతర్జాతీయ ప్రమాణాలతో పలు సందర్శక నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆర్కిటెక్టులు, ప్లానర్లతో పాటు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు నిర్మాణ విశేషాలను ఈ నెల 13న ‘మూసీ ఆహ్వానం’ పేరిట తాజ్‌కృష్ణ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివరించనున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో మూసీతో గోదావరి జలాల అనుసంధానం చేయనుండటం గమనార్హం. ఇది ఏపీ తలపెట్టిన కృష్ణా – గోదావరి అనుసంధానాన్ని తలపిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఏపీ రాజధాని అమరావతిలో రూ.119.27 కోట్ల అంచనా వ్యయంతో “తెలుగు సాంస్కృతిక కేంద్రం” నిర్మించబోతుంది. ఈ నిర్మాణానికి తాజాగా సీఆర్డీఏ(CRDA) ఆమోదం తెలుపడం విశేషం.తెలుగు సాంస్కృతిక కేంద్రాన్ని నీరుకొండ వద్ద 5 ఎకరాల్లో నిర్మిస్తారు.సాంస్కృతిక, కళా, సాహిత్య కేంద్రంగా తీర్చిదిద్దుతారు. అలాగే నీరుకొండ వద్ద 167 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లోనూ రవీంద్ర భారతీకి ప్రత్యామ్నాయంగా మరో భారీ కళాభవనం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇప్పటికే రవీంద్ర భారతీ కళా భవనాన్ని ఆధునీకరించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

Costly Marriages | కోట్ల ఖర్చుతో గ్రాండ్‌గా జరిగిన సెలబ్రిటీల‌ పెళ్లిళ్లు…. భారత్‌లో అత్యంత ఖరీదైన సెలబ్రిటీ వివాహాలు ఇవే!
వైరల్ గా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భాగ్యనగర్ వ్యాఖ్యలు!

Latest News