విధాత: తెలంగాణ (Telangana) లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దిండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి శిక్షణ నిమిత్తం బయలుదేరిన విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ఎయిర్‌ఫోర్స్ పైలట్లు (Airforce Pilots) దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఇన్‌స్ట్రక్టర్ కాగా మరొకరు క్యాడెట్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సోమవారం ఉదయం సుమారు 8:54 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిలాటస్ ట్రైనర్ శ్రేణికి చెందిన ఈ విమానం… మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద ప్రమాదానికి గురైంది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని జనాన్ని నియంత్రించారు.
మంటలను అదుపు చేసి చూడగా.. అప్పటికే అందులో ఉన్న ఇద్దరూ మరణించారని మెదక్ ఎస్పీ పేర్కొన్నారు. వారి శరీర భాగాలు ఏమైనా పడిపోయాయేమో అని చూసేందుకు చుట్టుపక్కల కూంబింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని.. దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎయిర్‌ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి.