Foetus |
బాలుడి కడుపులో పిండం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇది నిజమే. ఓ బాలుడి కడుపులో ఏర్పడిన 2 కిలోల పిండాన్ని వైద్యులు విజయవంతంగా తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ ఏడు నెలల బాలుడు.. గత కొద్ది రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఆ చిన్నారి కడుపు పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ చిన్నారి పేరెంట్స్.. అతన్ని ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడికి అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించగా, అతని శరీరంలో రెండు కిలోల పిండం ఉన్నట్లు నిర్ధారించారు.
బాలుడి శరీరంలో ఉన్న పిండానికి చేతులు, పాదాలు, వెంట్రుకలు అభివృద్ధి చెందుతున్నట్లు గుర్తించారు. పిండంలో పిండం(ఫీటస్ ఇన్ ఫీటూ) అనే అరుదైన పరిస్థితిని ఎదుర్కొంటున్న చిన్నారికి విజయవంతంగా సర్జరీ నిర్వహించి, దాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని, మెరుగుపడేందుకు కొంత సమయం పడుతుందన్నారు వైద్యులు.
పేరెంట్స్ అతన్ని ఆస్పత్రికి తీసుకురావడం మంచిదైందని, అప్రమత్తంగా లేకపోతే మూత్రపిండాల నుంచి రక్తస్రావం జరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ సర్జరీ చాలా సంక్లిష్టమైనదని తెలిపారు. అయితే 10 లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని చెప్పారు. తల్లి గర్భాశయంలో ట్విన్స్ డెవలప్ అవుతున్న దశలో ఏర్పడే వైకల్యం ఇది అని డాక్టర్లు స్పష్టం చేశారు.