చెన్నై : తమిళనాడులోని దక్షిణ జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. ఈ భారీ వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం మాదిరిగానే ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కన్యాకుమారి, తిరునేల్‌వెలి, తూత్తుకుడి, టెన్‌కాశీ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
దక్షిణ తమిళనాడులోని 39 రీజియన్లలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం అయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. వరద కారణంగా పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక విద్యుత్, తాగునీటి సరఫరాకు కూడా అంతరాయం కలగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొబైల్ కనెక్టివిటీ కూడా దెబ్బతిన్నది. మొత్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది.
కాయల్‌పట్టిణం, తూత్తుకుడి జిల్లాల్లో అత్యధికంగా 95 మి.మీ. వర్షపాతం నమోదైంది. తూత్తుకుడి జిల్లాలోని తిరుచెందూరులో 69 సెం.మీ., శ్రీవైకుంఠంలో 62 సెం.మీ., తిరునేల్‌వేలి జిల్లాలోని మొలైకరైపట్టిలో 62 సెం.మీ., మంజోలైలో 55 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
తిరునేల్‌వేలి, తూత్తుకుడి, టెన్‌కాశీ, కన్యాకుమారి జిల్లాల్లో 7,434 మందిని 84 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. 425 విపత్తు బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరునేల్‌వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, టెన్‌కాశీ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలు, ఇతర సంస్థలకు సెలవులు ప్రకటించారు.
భారీ వర్షాలపై గవర్నర్ సమీక్ష
తమిళనాడులో కురుస్తోన్న కుండపోత వర్షాలపై ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి.. రాజ్‌భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలపై సమీక్షించనున్నారు. 19 ట్రక్కుల్లో నిత్యవసరాలను తరలించారు. వాటర్ బాటిల్స్, బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్లు, పాల వంటి ఆహార పదార్థాలను నిరాశ్రయులకు అందజేశారు.