36 Hour Cobra Siege | ఇంటి సీలింగ్‌లో నల్ల త్రాచు.. బంధించడానికి 36 గంటలు పట్టింది!

ఇంట్లో వాళ్లు అదేదో వైరింగ్‌ ప్రాబ్లం అని అనుకున్నారు. కానీ.. అది కదలుతున్న తర్వాత అదొక పామని, అంతకు మించి విషపూరితమైన కోబ్రా అని తేలడంతో కంగుతిన్నారు. నోయిడాలోని సెక్టర్‌ 51లోని ఒక ఇంటిలో ఈ ఘటన చోటు చేసుకున్నది.

  • Publish Date - September 13, 2025 / 10:01 PM IST

36 Hour Cobra Siege | ఇంటిలోని గ్లాస్‌ ప్యానల్‌ ఫాల్‌సీలింగ్‌పై ఏదో ఒక వైర్‌ వేలాడుతున్నట్టు ఒక కుటుంబంలోని సభ్యులు గుర్తించారు. కానీ.. కాసేపటికే అదొక పాము అని గుర్తించారు. ఆ భయంతో ఆ పామును స్నేక్‌ క్యాచర్‌ వచ్చి బంధించేదాకా దాదాపు రెండు రోజులపాటు గదిలోకి వెళ్లి తలుపేసుకున్నారు. గౌతమ్‌బుద్ధ నగర్‌ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది రెండు రోజులసుదీర్ఘ ప్రయత్నాల అనంతరం బుధవారం సాయంత్రం ఆ పామును సురక్షితంగా బంధించారు.

సెక్టర్‌ 51లోని ఇంటిలో ఒక పాము ఉందని సమాచారం రావడంతో సిబ్బంది మంగళవారం అక్కడకు వెళ్లారని, కానీ.. అది కనిపించలేదని అటవీ సిబ్బంది తెలిపారు. దీంతో బుధవారం మళ్లీ దానిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశామని, గౌతమ్‌బుధ్‌ నగర్‌ డీఎఫ్‌వో పీకే శ్రీవాస్తవ చెప్పారు. వర్షాకాలం కావడంతో పాములు తరచూ ఇళ్లలోకి చొరబడుతూ ఉంటాయి. ఇదే క్రమంలో అత్యంత విషపూరితమైన కోబ్రా ఒకటి.. సీలింగ్‌ ప్యానల్‌ లోపలి నుంచి సదరు ఇంటిలోకి చొరబడిందని అటవీ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. అందులో సీలింగ్‌ వెంట్‌ ద్వారా నల్ల త్రాచు పాకుతూ కనిపిస్తున్నది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఇంటినుంచి బయటకు పారిపోయి.. చుట్టుపక్కలవాళ్లకు సమాచారం ఇచ్చారు. ఆ పాము దాదాపు ఐదు అడుగుల పొడవు ఉందని సెక్టర్‌ 51 రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. తొలుత సీలింగ్‌లో ఏదో వైర్‌ ప్రాబ్లం అనుకున్నారని, కానీ.. అది కదిలేసరికి పాముగా గుర్తించారని చెప్పారు. వాళ్లు విషయం తమకు చెప్పడంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈ ఏరియాలో ఖాళీగా ఉన్న కొన్ని ఇళ్లల్లో పాములు గుడ్లు పెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యపై తాము అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని వివరించారు.

తొలుత పాములు పట్టేవారిని పిలిపించగా.. ఆ కోబ్రా దొరకలేదు. దీంతో ఆ కుటుంబంలోని భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు పనివారు అదే భవనంలోని పై అంతస్థుకు వెళ్లిపోయారు. అయితే.. వయసులో పెద్దవారైన భార్యాభర్తల మెడిసిన్స్‌ కింద అంతస్తులో ఉన్న వంట గది సమీపంలో ఉండటంతో వారు ఆందోళనకు గురయ్యారు. ‘పామును పట్టుకోవడానికి ఫాల్‌సీలింగ్‌ మొత్తాన్ని తొలగించాలని అధికారులు చెప్పారని, కానీ.. ఆ అవసరం లేకుండా ఆ పామును అటవీ సిబ్బంది పట్టుకున్నారని సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. సీలింగ్ షాప్ట్‌పై తాము పౌడర్‌ చల్లి, కోబ్రా వస్తుందని చూశామని మంగళవారం నుంచి ఈ పామును పట్టుకునేందుకు శ్రమించిన జూనియర్‌ ఫారెస్ట్‌ స్టాఫర్‌ విద్యాసాగర్‌ పాండే తెలిపారు. బుధవారం కిచెన్‌ చిమ్నీ వద్ద పాము కనిపించడంతో సాయంత్రం సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో దానిని సురక్షితంగా పట్టుకుని, ఓఖ్లా బర్డ్‌ శాంక్చురీలో వదిలేశామని తెలిపారు. ఈ పామును పట్టుకునేందుకు తమ సిబ్బంది సుమారు 36 గంటలపాటు కష్టపడ్డారని డీఎఫ్‌వో శ్రీవాస్తవ తెలిపారు. గౌతమ్‌బుద్ధ్‌ నగర్‌లో వర్షాకాలంలో ప్రతి నెలా ఐదారు త్రాచు పాములు కనిపిస్తుంటాయని తెలిపారు. అయితే.. పాము కరిచిన 40 నిమిషాల్లోపు తగిన చికిత్స అందించకుంటే ప్రాణాంతకమని చెప్పారు.