Madhya Pradesh | న్యూమోనియాతో బాధపడుతున్న ఓ పసిపాపను హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు. ఆ చిన్నారికి పట్టిన జబ్బును తాను వదిలిస్తానని మంత్రగాడు నమ్మించాడు. ఇక ఇనుప రాడ్‌ను కాల్చి ఆ పాప పొట్ట చుట్టూ.. 51 వాతలు పెట్టాడు. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై, 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది చిన్నారి. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. షాదోల్ జిల్లా సింగ్‌పుర్ కథౌటియా గ్రామానికి చెందిన ఓ మూడు నెలల చిన్నారి న్యూమోనియా బారిన పడింది. ఈ క్రమంలో పాపకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. ఆ పసిపాపను హాస్పిటల్‌కు తీసుకెళ్లలేదు. స్థానికంగా ఉన్న ఓ మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు. అతను ఓ ఇనుప రాడ్‌ను కాల్చి.. పాప పొట్ట చుట్టూ 51 సార్లు కాల్చాడు. దీంతో పాప తీవ్ర అనారోగ్యానికి గురైంది. చేసేదేమీ లేక పాపను ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు చికిత్స అందించడం ప్రారంభించారు. కాలిన గాయాలతో బాధపడుతున్న చిన్నారికి 15 రోజుల పాటు చికిత్స పొంది చివరకు ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే కథౌటియా గ్రామంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో గిరిజనులు అధికంగా ఉంటారు. పిల్లలు న్యూమోనియాతో పాటు ఇతర జబ్బుల బారిన పడితే.. స్థానికంగా ఉన్న మంత్రగాడిని సంప్రదిస్తారు. అయితే న్యూమోనియాకు సరైన చికిత్స రాడ్ కాల్చి పొట్ట చుట్టూ వాతలు పెడితే నయమవుతుందని గిరిజనులు భావించి, అతని వద్దకు తీసుకెళ్తారు. కానీ గిరిజనుల మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలైంది.