విధాత: ప్రపంచ దేశాల నుంచి మన వాళ్లు సంపాదించిన సొమ్ము ప్రవాహంలా మన దేశంలోకి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ డబ్బు ఏం ఖర్మ ఏకంగా.. బంగారమే ఓ ప్రవాహంలా వచ్చి పడుతున్నది. కానీ ఇది సక్రమ మార్గంలో కాకుండా వక్రమార్గంలో వస్తుండటంతోనే ఇబ్బంది వచ్చి పడింది.
బంగారంపై దిగుమతి సుంకాలు పెంచటం, కరోనా పరిస్థితుల తర్వాత రవాణా వ్యవస్థలు పూర్వవైభవం పొందటంతో అంతర్జాతీయ రాకపోకలు బాగా పెరిగిపోయాయి. అయితే.. ఈ నేపథ్యంలోంచే.. మునుపెన్నడూ లేని స్థాయిలో బంగారం అక్రమ రవాణా పెరిగిపోయింది. ఈ నవంబర్ నాటికి ఏడాది కాలంలోనే 3వేల కిలోల దొంగ బంగారం పట్టుబడింది.
దేశంలోకి విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున తీసుకు రావటానికి మన ప్రభుత్వాలు పడరాని పాట్లు పడుతున్నాయి. పెట్టుబడులతోనే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. కానీ అదే బంగారం వస్తే మంచిదే కదా అనుకుంటే పొరపాటు. అది వక్రమార్గంలో వచ్చి చేరితే.. అది మన ఆర్థిక పునాదులకే ముప్పు తెచ్చి పెడుతుందని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.
విమానాశ్రయాలు, ఓడ రేవుల్లో నిఘా, తనిఖీలు ముమ్మరం చేసి బంగారం అక్రమ రవాణాను కేంద్ర ప్రభుత్వం అడ్డుకొంటున్నది. అక్రమ బంగారం కేరళ రాష్ట్రంలో అతి ఎక్కువగా 690 కిలోలు పట్టుబడగా, మహారాష్ట్రలో 474 కిలోలు, తమిళనాడులో 440 కిలోల బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. పట్టుకొంటున్నదే ఈ స్థాయిలో ఉంటే.. దొరకనిది ఇంకెంత ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతున్నది. బంగారం అక్రమ రవాణాను అడ్డుకోకుంటే అది మన ఆర్థిక వ్యవస్థకే ముప్పు అని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.