Amazon Plane Crash | అమెజాన్ అడ‌వుల్లో కుప్పకూలిన విమానం..15 రోజుల తర్వాత సజీవంగా పిల్లల గుర్తింపు

Amazon Plane Crash | అమెజాన్ అడ‌వుల్లో మే ఒక‌టిన‌ కూలిన విమానం పైలెట్‌, పిల్ల‌ల త‌ల్లి, మ‌రో ప్ర‌యాణికుడి దుర్మ‌ర‌ణం ప‌క్షం రోజుల త‌ర్వాత 11 నెలల చిన్నారి స‌హా 4, 9, 13 ఏండ్ల పిల్లల‌ను స‌జీవంగా గుర్తించిన‌ రెస్క్యూ టీం విధాత: ప్ర‌పంచంలో అనేక అద్భుతాలు జ‌రుగుతాయి. అమెజాన్ అడవుల్లో ఎవ‌రూ ఊహించ‌ని అద్భుతం చోటుచేసుకున్న‌ది. అమెజాన్ అడ‌వుల్లో మే ఒక‌టిన ఓ విమానం కూలిపోయింది (Amazon Plane Crash). స్పాట్‌లో పైలెట్‌స‌హా […]

  • Publish Date - May 18, 2023 / 07:43 AM IST

Amazon Plane Crash |

  • అమెజాన్ అడ‌వుల్లో మే ఒక‌టిన‌ కూలిన విమానం
  • పైలెట్‌, పిల్ల‌ల త‌ల్లి, మ‌రో ప్ర‌యాణికుడి దుర్మ‌ర‌ణం
  • ప‌క్షం రోజుల త‌ర్వాత 11 నెలల చిన్నారి స‌హా 4, 9, 13 ఏండ్ల పిల్లల‌ను స‌జీవంగా గుర్తించిన‌ రెస్క్యూ టీం

విధాత: ప్ర‌పంచంలో అనేక అద్భుతాలు జ‌రుగుతాయి. అమెజాన్ అడవుల్లో ఎవ‌రూ ఊహించ‌ని అద్భుతం చోటుచేసుకున్న‌ది. అమెజాన్ అడ‌వుల్లో మే ఒక‌టిన ఓ విమానం కూలిపోయింది (Amazon Plane Crash). స్పాట్‌లో పైలెట్‌స‌హా మ‌రో ఇద్ద‌రు చ‌నిపోయారు. కానీ, అదే విమానంలో ప్ర‌యాణించిన న‌లుగురు చిన్నారులు మాత్రం ప్రాణాల‌తో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారు. మృత్యువును జ‌యించారు.

ప‌క్షం రోజుల త‌ర్వాత కూడా 11 నెలల చిన్నారిస‌హా 4, 9, 13 సంత్స‌రాల పిల్ల‌లు ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో ప్రాణాల‌తో స‌జీవంగా ఉన్నారంటే మహా అద్భుతం కాకుంటే మ‌రేమిటి. వారి ధైర్యానికి ప్రపంచ‌మంతా దాసోహం అంటున్న‌ది.

కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ నలుగురు పిల్లల చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. విమాన ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత, ఆ దేశ సైన్యం, అగ్నిమాపక శాఖ, పౌర విమానయాన శాఖ అధికారులు ఈ పిల్లలను కనుగొనడంలో విజయం సాధించారని ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

అస‌లు ఏమి జ‌రిగిందంటే..

మే ఒక‌టో తేదీన అమెజాన్ అడ‌వుల మీదుగా వెళ్తున్న విమానంలో ఒక కుటుంబం ప్ర‌యాణిస్తున్న‌ది.
విమానం కూలిపోవడానికి కొద్ది క్షణాల ముందు పైలట్.. విమానం ఇంజిన్లలో సమస్య తలెత్తినట్టు గ్రౌండ్ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. ఆ తరువాత కొద్దిసేపటికే రాడార్‌పై విమానం జాడ కనిపించకుండా పోయింది.

సాంకేతిక లోపంతో విమానం కూలిన‌ విష‌యం తెలియ‌డంతో ప్ర‌భుత్వం స‌హాయ చ‌ర్య‌ల‌కు ఆదేశించింది. అమెజాన్ అడవుల్లో ‘ఆపరేషన్ హోప్’పేరుతో 100 మంది సైనికులు అంగుళం అంగుళం గాలింపు చేపట్టారు. 40 మీటర్ల ఎత్తుంటే భారీ వృక్షాలు, రకరకాల జంతువులు గాలింపుల్లో వారి కంటపడేవి. పైగా రోజూ వ‌ర్ష‌మే. గాలింపు చ‌ర్య‌ల‌కు తీవ్ర ఆటంకం క‌లిగించేవి. కానీ, ప‌ట్టువిడువకుండా గాలింపు కొన‌సాగించారు.

హెలికాఫ్టర్లకు పెద్ద స్పీకర్లు అమర్చి

అరుదైన జంతువులకు, ప్రాణులకు ఆలవాలమైన అమెజాన్ అడువుల్లో గాలింపు ఆషామాషీ కాదు. పైగా చిన్నారులు. వారికి ఏం చేయాలో తెలియక భయంతో ఆ అడవుల్లో ఎటుపడితే అటు తిరిగేయటంతో ఆర్మీకి వారి జాడ గుర్తించటం చాలా కష్టమైంది. దీంతో అధికారులు హెలికాప్ట‌ర్ల‌కు పెద్ద స్పీకర్లు అమర్చి చిన్నారులకు అర్థమయ్యేలా వారి మాతృభాషలో అరిచి వినిపించేవారు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండీ.. మీకోసం మేమున్నాం.. మేం వస్తున్నాం.. మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళతాం .. అంటూ స్పీకర్లో పదే పదే చెప్పేవారు.

క‌నిపించిన గుడారం

రెండువారాలుగా గాలిస్తున్న ఆర్మీ సిబ్బంది ఆశ చిగురించేలా చిన్నారులు క్షేమంగా ఉన్నారని చెప్పేందుకు పలు ఆధారాలు మంగ‌ళ‌వారం బయటపడ్డాయి. ఈ గాలింపులో భాగంగా ఆ చిన్నారుల తల్లి, పైలట్, మరో ప్రయాణికుడి మృతదేహాలు వారికి కనిపించాయి. కర్రలతో ఏర్పాటుచేసిన చిన్న గుడారం, కత్తెర, జుట్టుకు కట్టుకునే రిబ్బన్, చిన్నారికి పాలు పట్టే సీసా, సగం తిన్న పండు వంటివి వారికి కనిపించాయి. ఆ దారి వెంట ప్రతీ అంగుళం గాలిస్తు ముందుకెళ్లారు.

చిన్నారులు బతికే ఉన్నారని రెస్క్యూ సిబ్బందికి నమ్మకం పెరిగింది. ఆ నమ్మకంతోనే మరింతగా గాలింపు ముమ్మరం చేశారు. వారి గాలింపులో భాగంగా చిన్నారులు ఎటువెళ్లాలో తెలీక అడవంతా తిరుగుతున్నట్లుగా వారికి లభ్యమైన వస్తువులను బట్టి గుర్తించారు. ఈ క్రమంలో గాలింపు చర్యలను మరింత విస్తృతం చేశారు. అలా బుధవారం చిన్నారుల ఆచూకీ లభించింది. 11 నెలల చంటిబిడ్డతో సహా మరో ముగ్గురు పిల్లలను అడవినుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

హుయిటోటో కమ్యూనిటీ క‌బ‌ట్టే బ‌తికారు..

చిన్నారులు కొలంబియాలోని హుయిటోటో కమ్యూనిటీకి చెందినవారు. వీరిని విటోటో అని కూడా పిలుస్తారు. వీరు మారుమూల అడవి ప్రాంతాల్లోనూ జీవిస్తారు. వీరి కమ్యూనిటీలో వేట, చేపలు పట్టడం స‌హ‌జం. ఈ నైపుణ్య‌మే పిల్లలు 16 రోజులపాటు అడవిలో జీవించడానికి సహాయపడి ఉండవ‌చ్చ‌ని అధికారులు భావిస్తున్నారు.