విధాత, హైదరాబాద్ : పదేళ్లు అధికారంలో ఉండి గద్వాల అభివృద్ధిని పట్టించుకోని కేటీఆర్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నాడంటూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఎస్ .ఏ. సంపత్ కుమార్ విమర్శించారు. పదేళ్లలో చేనేత శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గద్వాలలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేనేత కార్మికలను మోసం చేశారని..శంకుస్థాపన ఫలకం చుట్టు పిచ్చి మొక్కలు మొలిచాయి.. కేటీఆర్ వెళ్లి చూడాలి అని డిమాండ్ చేశారు. తుమ్మిల ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి సగం సగం పనులు చేసిపోయారని.. సరైన సౌకర్యాలు కల్పించకుండానే వంద పడకల ఆస్పత్రి రిబ్బన్ కట్ చేసి పోయారని..10 ఏళ్లలో జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు ఒక్క రూపాయి ఇవ్వలేదని..పదేళ్లలో నడిగడ్డ ప్రజలను మోసం చేశారని సంపత్ విమర్శించారు. మీ చెల్లెను చూసుకోలేవు…నీ వల్లనే బీఆర్ఎస్ మునిగిపోతుందని మీ కార్యకర్తలే అంటున్నారని కేటీఆర్ పై సంపత్ మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలలో వంద పడకల ఆస్పత్రిని అన్ని సౌకర్యాలతో ప్రారంభించుకున్నాం అని..మా ప్రభుత్వ హయాంలో మల్లమ్మ గుంటకు సర్వే పనుల ప్రారంభమయ్యాయని, రూ.120 కోట్లతో జూరాలపైన కొత్త బ్రిడ్జిని నిర్మిస్తున్నాం అని తెలిపారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్రీ లింగం, పురుష లింగం అంటు కేటీఆర్ విమర్శలు చేస్తున్నాడని…టికెట్ ఇచ్చేటప్పుడు ఏ లింగమో నీకు తెలియదా అని సంపత్ ప్రశ్నించారు. 10 ఏళ్లలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా కాలరాశారు..నేను కాంగ్రెస్ విప్ గా ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలను ఐదుగురిని, టీడీపీ ఎమ్మెల్యేలను 15 మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ఫిరాయింపులపైన నేనే సుప్రీంకోర్టు లో పిటిషన్ వేశాను..మీరు చేస్తే సంసారం..వేరే వాళ్లు చేస్తే వ్యభిచారమా..? అని సంపత్ ప్రశ్నించారు.