విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని క్షేత్రస్థాయిలో భారీ భద్రత ఏర్పాట్లు చెప్పబడినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ తెలిపారు. గురువారం ఆయన మాడుగుల, యాచారం పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఇబ్రహీంపట్నం, మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాచకొండ పరిధిలో 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రాచకొండ పరిధిలో జరిపిన తనిఖీల్లో 40 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వెల్లడించారు. అవసరమైన చోట మరిన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు.
ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను సిబ్బందికి అందించామని క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కిందిస్థాయి సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల పట్ల పరిజ్ఞానాన్ని అవగాహనను కల్పించడానికి సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రాచకొండ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వాహణలో సమస్యలు లేకుండా అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పాత నేరస్థులను బైండోవర్ చేస్తున్నామని మాడుగుల పరిధిలో గత ఎన్నికల సమయంలో పలు రకాల నేరాలకు పాల్పడిన వారిని 90 మంది కి పైన ముందస్తుగా బైండోవర్ చేసినట్లు తెలిపారు.