విధాత: హైదరాబాద్ చందానగర్‌లో విషాదం చోటు చేసుకున్నది. పాపిరెడ్డి కాలనీలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలకు ఓ కుటుంబం బలైంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. పాపిరెడ్డి నగర్‌లో ఇంటిపెద్ద నాగరాజు కుటుంబ సభ్యులందరినీ చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంటికి గడియ పెట్టి ఉండటంతో మూడు రోజులుగా విషయం బైటికి రాలేదు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తలుపులు తీసి చూడంగా విషాదం వెలుగు చూసింది. మృతులు నాగరాజు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య సుజాత, పిల్లలు రమ్యశ్రీ, టిల్లు విగత జీవులుగా కనిపించారు. నాగరాజే భార్య పిల్లలను కత్తితో పొడిచి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
సంగారెడ్డి జిల్లా పొట్లంపాడు నుంచి వచ్చిన నాగరాజు చందానగర్‌లో నివాసం ఉంటున్నాడు. కిరాణ దుకాణాలకు బ్రెడ్ సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య కుట్టు పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నది. ఈ క్రమంలో ఏం జరిగిందో కుటుంబం మొత్తం ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులు, కలహాలు ఈ ఘటనకు దారితీశాయా అనే కోణంలో విచారిస్తున్నారు.