- పురుగు ఫొటోతోసహా సోషల్ మీడియాలో
- చేదు అనుభవాన్ని పోస్టు చేసిన బాధితురాలు
- హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో ఘటన
విధాత: మన జీవితాల్లో వేగం పెరిగింది. ముఖ్యంగా నగరవాసులు మరీ బిజీ.. ఆహారం వండుకోవడానికి సమయమే ఉండటం లేదు. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం.. అది రాగానే ఆరగించడం ఇటీవల బాగా పెరిగింది. ఫుడ్ డెలివరీ అప్లికేషన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది కొందరికి అనుకూల ఎంపికగా మారింది. సమయం కూడా ఆదా అవుతున్నది. కానీ, అందుకున్న ఆహారం నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసిన వంటల్లో కొన్నిసార్లు పురుగులు వస్తున్నాయి. బల్లులు, బొద్దింకలు వస్తున్నఫిర్యాదులు కూడా ఇటీవల పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌లో బొద్దింక రావడంతో భయపడిపోయింది. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌కు చెందిన మహిళా వినియోగదారు తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నది.
గురుగ్రామ్‌కు చెందిన సోనై ఆచార్య అనే మహిళ.. ఆటీ ఫగ్స్ అనే దుకాణం నుంచి జపనీస్ రామెన్ గిన్నెను ఆర్డర్ చేసింది. జొమెటో ద్వారా ఆమె ఆర్డర్ చేసిన ఆహారంలో బొద్దింక కనిపించింది. నూడిల్ సూప్‌లో చనిపోయిన బొద్దింకను చూసి బెంబేలెత్తిపోయింది. “ఇప్పుడే జొమాటో నుంచి ఆర్డర్ చేయడం భయంకరమైన అనుభవాన్ని మిగిల్చింది. ఆంటీ ఫగ్స్ నుంచి జపనీస్ మిసో రామెన్ చికెన్‌ను ఆర్డర్ చేశాను. నా భోజనంలో బొద్దింక వచ్చింది.! అది దారుణంగా, అసహ్యంగా ఉంది. ఇక్కడ నాణ్యతలో తీవ్ర నిరాశ చెందాను. మరోసారి ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటేనే భయమేస్తున్నది” అని ఆమె ఎక్స్‌లో రాసింది.
బాధిరాలి ఫిర్యాదుపై జొమాటో వెంటనే స్పందించింది. “దురదృష్టకర ఘటన గురించి చింతిస్తున్నాము. మేము ఆఫుడ్‌ను మార్చుతాము మాకు కొంత సమయం ఇవ్వండి అని పేర్కొన్నది. డెలివరీ ఆర్డర్‌చేసిన మొత్తాన్ని రీఫండ్ చేస్తాం” అని కంపెనీ తెలిపింది.
సోని పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందించారు. తమకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు చాలా ఎదురయ్యాయని వాపోయారు. తాను ఒక రెస్టారెంట్ నుంచి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తే అందులో కూడా బొద్దింక వచ్చిందని ఓ నెటిజన్ తెలిపారు.