ఎలుక కొర‌క‌డంతో నెల రోజుల శిశువు మృతి

ఆ ప‌సికందు వ‌య‌సు నెల రోజులు మాత్ర‌మే. ఇంట్లో హాయిగా నిద్రిస్తున్న ఆ పసిపాప‌ను ఎలుక కొరికింది. దీంతో ఆ పాప‌కు తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగి చ‌నిపోయింది.

  • Publish Date - December 25, 2023 / 05:43 AM IST

నాగర్‌కర్నూల్ : ఆ ప‌సికందు వ‌య‌సు నెల రోజులు మాత్ర‌మే. ఇంట్లో హాయిగా నిద్రిస్తున్న ఆ పసిపాప‌ను ఎలుక కొరికింది. దీంతో ఆ పాప‌కు తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగి చ‌నిపోయింది. ఈ విషాద ఘ‌ట‌న నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలులో చోటుచేసుకున్నది.

వివ‌రాల్లోకి వెళ్తే.. నాగ‌ర్‌క‌ర్నూల్ మున్సిపాలిటీ ప‌రిధిలోని పెద్దకార్పాములకు చెందిన శివతో నాగనూలుకు చెందిన లక్ష్మికి మూడేండ్ల కిందట వివాహం జ‌రిగింది. 40 రోజుల క్రితం ఆ దంప‌తుల‌కు పండంటి మ‌గ‌బిడ్డ జ‌న్మించాడు. అనంత‌రం ల‌క్ష్మి త‌న పుట్టింటికి వెళ్లింది. అయితే శనివారం ఉదయం శిశువు నిద్రిస్తున్న స‌మ‌యంలో, ఆ చిన్నారి ముక్కును ఎలుక కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది.


దీంతో అప్ర‌మ‌త్త‌మైన త‌ల్లి ల‌క్ష్మి.. చిన్నారిని నాగర్‌కర్నూల్‌ జిల్లా దవాఖానకు తీసుకెళ్లింది. గాయం తీవ్రంగా ఉండటం, శిశువు వయస్సు దృష్ట్యా వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు త‌ర‌లించారు. అప్పటికే గాయం తీవ్రంగా ఉండటంతో శిశువు శరీరం చికిత్సకు సహకరించలేదు. చికిత్స నిర్వహిస్తుండగానే ఆదివారం సాయంత్రం ప‌సిబాబు మృతి చెందాడు. దీంతో చిన్నారి త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.