చెట్లు నాటడం కంటే.. సౌర ఫ‌ల‌కాలు ఏర్పాటు చేస్తే త్వ‌రిత‌గ‌తిన ఫ‌లితాలు !.. వెల్ల‌డించిన అధ్య‌య‌నం

భూతాపాన్ని తగ్గించుకోవడానికి శాస్త్రవేత్త‌లు వివిధ మార్గాల‌ను అన్వేషిస్తున్న విష‌యం తెలిసిందే

  • Publish Date - November 27, 2023 / 08:30 AM IST

విధాత‌: భూతాపాన్ని (Rising Temperatures) తగ్గించుకోవడానికి శాస్త్రవేత్త‌లు వివిధ మార్గాల‌ను అన్వేషిస్తున్న విష‌యం తెలిసిందే. ఒక‌వైపు అడ‌వుల (Forests) న‌రికివేత‌, మ‌రోవైపు శిలాజ ఇంధ‌నాల విప‌రీత వాడ‌కం వ‌ల్ల ప‌రిస్థితులు చక్క‌బ‌డ‌టం ఇప్ప‌టికిప్పుడు సాధ్య‌మ‌వుతుందా అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న‌ ముందున్న ప్ర‌త్యామ్నాయాల్లో ఏది త్వ‌ర‌గా స‌త్ఫ‌లితాల‌నిస్తుంద‌న్న దానిపై శాస్త్రవేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేశారు.


ముఖ్యంగా ఒక ఖాళీ స్థ‌లం ఉంటే అందులో చెట్లు పెంచ‌డం వ‌ల్ల ఎక్కువ లాభ‌ముంటుందా లేదా సౌరఫ‌ల‌కాలు (Solar Panels) ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ఎక్కువ ప్ర‌యోజ‌న‌ముంటుందా అనే అంశంపై లోతుగా విశ్లేష‌ణ‌లు చేశారు. ఆ ఫ‌లితాల‌ను విశ్లేషించ‌గా.. చెట్లు నాట‌డం కంటే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయ‌డం వ‌ల్లే భూ తాపంపై జ‌రిగే పోరులో త్వ‌రితగ‌తిన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని తేలింది. ఈ ప‌రిశోధన వివ‌రాల‌ను ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.


ఆ వివ‌రాల ప్ర‌కారం.. సోలార్ ప్యానెల్స్ 2.5 ఏళ్ల‌లోనే శిలాజ ఇంధ‌నాల‌ స్థానంలో త‌మ విద్యుదుత్ప‌త్తిని ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా క‌ర్బ‌న ఉద్గారాల‌ను త‌గ్గించే బాధ్య‌త‌ను తీసుకుంటాయి. అదే చెట్లు అయితే ఆ బాధ్య‌త‌ను తీసుకోవ‌డానికి కొన్ని ద‌శాబ్దాలు ప‌ట్టొచ్చు. ఈ రెండింటి మ‌ధ్య ఈ వైరుధ్యం.. వాటి ప‌నితీరు వ‌ల్ల‌నే ప్ర‌భావిత‌మైంది. సోలార్‌ప్యానెల్స్ ప‌నితీరును ప‌రిశీలిస్తే ఇవి నేరుగా సూర్యుని వెలుగును శోషించుకుని విద్యుదుతుత్ప‌త్తి చేస్తాయి.


దీంతో ఆ మేర‌కు శిలాజ ఇంధ‌నాల (Fossil Fuels) వినియోగం త‌గ్గిపోతుంది. ఇక్క‌డ ప్ర‌యోజ‌నం నేరుగా జ‌రుగుతోంది. అదే అడ‌వుల విష‌యానికి వ‌స్తే… అవి కార్బ‌న్ డై ఆక్సైడ్‌ను తీసుకుని గ్రీన్ హౌస్ గ్యాస్‌ల స్థాయిని త‌గ్గిస్తాయి. ఇక్క‌డ నేరుగా ప్ర‌యోజ‌నం జ‌ర‌గ‌దు. కాబట్టి చెట్లు పెంచ‌డం క‌న్నా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే స‌మీప భ‌విష్య‌త్తులో మంచి ఫ‌లితాలు ల‌భిస్తాయ‌ని శాస్త్రవేత్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.


అయితే మొత్తంగా చూసుకుంటే అడ‌వులను ఏ ప్ర‌త్యామ్నాయ వ్య‌వ‌స్థా పూరించ‌లేద‌ని ఈ అధ్య‌య‌నం పేర్కొంది. అడ‌వులు కేవ‌లం కార్బ‌న్ డై ఆక్సైడ్‌ను శోషించుకోవ‌డం మాత్ర‌మే కాద‌ని.. జీవ‌జాలానికి, వాతావ‌ర‌ణానికి, ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో అవ‌స‌ర‌మ‌ని గుర్తు చేసింది. కాక‌పోతే.. చెట్లు అంత‌గా అవ‌స‌రం లేని చోట‌, పారిశ్రామిక ప్రాంతాల్లో, ఎడారి, వ‌ర్షాభావ ప్రాంతాల్లో క‌ష్ట‌ప‌డి చెట్లు పెంచే కంటే సౌర‌ఫ‌ల‌కాల ఏర్పాటు మంచి ఫ‌లితాల‌నిస్తుంద‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది.

Latest News