హిమాచల్‌, గుజరాత్‌ ఎన్నికలతో గల్లంతైన ఆప్‌ ఆశలు

కేజ్రీవాల్‌ అనుసరిస్తున్న ఢిల్లీ మూస ఫార్ములాయే ఆప్‌ వైఫల్యానికి కారణం జాతీయ పార్టీగా మాత్రం గుర్తింపు విధాత: బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆశలు గల్లంతయ్యాయి. ఢిల్లీ పునాదిగా క్రమంగా దేశ వ్యాప్తంగా విస్తరించాలనే ఆప్‌ ఆలోచనకు గండిపడింది. పంజాబ్‌ గెలుపుతో వచ్చిన భ‌రోసాతో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆప్‌ ఆశించిన ఫలితాలు రాబట్టలేక పోయింది. గుజరాత్‌లోని 182 సీట్లలో అన్నింటా పోటీ చేసిన ఆప్‌ కేవలం ఐదింటిని గెల్చుకొని ఉనికిని చాటుకొన్నది. […]

  • Publish Date - December 8, 2022 / 01:01 PM IST
  • కేజ్రీవాల్‌ అనుసరిస్తున్న ఢిల్లీ మూస ఫార్ములాయే ఆప్‌ వైఫల్యానికి కారణం
  • జాతీయ పార్టీగా మాత్రం గుర్తింపు

విధాత: బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆశలు గల్లంతయ్యాయి. ఢిల్లీ పునాదిగా క్రమంగా దేశ వ్యాప్తంగా విస్తరించాలనే ఆప్‌ ఆలోచనకు గండిపడింది. పంజాబ్‌ గెలుపుతో వచ్చిన భ‌రోసాతో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆప్‌ ఆశించిన ఫలితాలు రాబట్టలేక పోయింది. గుజరాత్‌లోని 182 సీట్లలో అన్నింటా పోటీ చేసిన ఆప్‌ కేవలం ఐదింటిని గెల్చుకొని ఉనికిని చాటుకొన్నది. కానీ హిమాచల్‌ ప్రదేశ్‌లో కనీసం బోణీ కొట్టలేక పోయింది. కేజ్రీవాల్‌ అనుసరిస్తున్న ఢిల్లీ మూస ఫార్ములా కాకుండా… రాజకీయ వ్యూహాలు రచించి అమలు చేయటంలో కేజ్రీవాల్‌ బలహీనతను ఈ ఎన్నికలు చాటాయి.

ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా.. ఆప్‌ జాతీయ పార్టీగా గుర్తింపు దక్కించుకొన్నది. జాతీయ పార్టీగా గుర్తింపు ఉండాలంటే కనీసం ఆ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేసి పోలైన ఓట్లలో 6శాతం ఓట్లు సాధించాలి. లేదా ఏవైనా నాలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 11 ఎంపీ స్థానాలను గెల‌వాలి. ఆప్‌ ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉండగా గోవాలో రెండు అసెంబ్లీ సీట్లు గెలిచి ఐదు శాతం ఓట్లను సాధించింది. తాజాగా గుజరాత్‌లో 5 సీట్లను గెల్చుకొని 12శాతం ఓటు శేరును సొంతం చేసుకొని జాతీయ పార్టీగా సాంకేతికతను సాధించింది.

అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పురుడు పోసుకున్న ఆప్‌.., ఆమ్‌ ఆద్మీ విశ్వసనీయతను పొందలేక పోతున్నది. కేజ్రీవాల్‌ అనుసరిస్తున్న వ్యవహార సరళి ఆప్‌ను సాధారణ పౌరుని చెంతకు చేర్చలేక పోతున్నది. ఫలితంగా ఆప్‌ మధ్య తరగతి, మేధావి వర్గాల పార్టీగా భావించ బడుతున్నది. ఢిల్లీలో మురికి వాడలు, వలస కార్మికుల ఆదరణతో పాటు ఉద్యోగ వర్గాల దన్నుతో నెగ్గుకొస్తున్నది. ఈ మూస నుంచి బయటపడితే తప్ప ఆప్‌కు అంతటా ఆదరణ వచ్చే పరిస్థితి కనిపించటం లేదు.