Site icon vidhaatha

‘ఆదిపురుష్’.. ఏం జరుగుతోందసలు? మరో విక్రమసింహ కానుందా?

విధాత‌: కొచ్చాడయాన్ అనగానే చాలామందికి గుండెల్లో దడ మొదలవుతుంది. అదేనండి తెలుగులో ‘విక్రమసింహ’. రజినీకాంత్ హీరోగా ఆయన సుపుత్రిక దర్శకత్వం వహించిన చిత్రమది. ఏదో కార్టూన్ ఫిలిం లాగా ఉంటుంది. కానీ ఈ సినిమా ముందు హంగామా చూసి అందరూ ఏదో అనుకున్నారు.

ఇప్పుడు ఆదిపురుష్‌ విషయంలో కూడా అదే జరుగుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్‌’ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందేమోనని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసినప్పటికీ ఫ‌లితం ద‌క్క‌లేదు. ఆ సినిమా గ్రాఫిక్స్ పనుల కోసం చిత్ర యూనిట్ సభ్యులు మరింత సమయం తీసుకోవాల్సి వచ్చింది.

ఎలాగైనా మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రభాస్ మళ్లీ రీ వర్క్ అయితే చేయిస్తున్నాడు. ఆ సినిమా విడుద‌ల‌ తేదీ విషయంలో ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి నుంచి వాయిదా ప‌డ‌టంతో జూన్‌‌లో దీనిని విడుద‌ల చేయాలని మరొక ప్రకటన అయితే వచ్చింది. అయితే ఆదిపురుష్‌ సినిమా పనులు ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

దర్శకుడు ఓం రౌత్‌ ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రణాళికను రచించుకున్నప్పటికీ కూడా గ్రాఫిక్స్ పనులు నిర్వహించే సంస్థ మాత్రం ఇంకా సమయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ కూడా సినిమాను ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి ఆ విషయంలో మరోసారి ఆలోచిస్తున్నారు. ఇక అటు ఇటుగా చూస్తే ఈ సినిమా జూన్లో కూడా వచ్చే అవకాశం లేదు.

దాంతో ఆదిపురుష్ స్థానంలో సలార్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టు తెలుస్తోంది. మొదటగా స‌లార్‌ను కూడా వచ్చే ఏడాదే అని చెప్పారు. సలార్ మూవీ ముందుగా వస్తే ఆదిపురుష్ ఆల‌స్యం వల్ల.. ఆ మూవీతో క్లాష్ అయ్యే అవకాశం ఉంది. సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ ఉండాలి అని ప్రభాస్ ఆలోచిస్తున్నాడు.

అందుకే సలార్ మీద ఉన్న నమ్మకంతో ముందుగా సలార్‌ను ప్రేక్షకుల ముందు తేనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆదిపురుష్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు, ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

డార్లింగ్‌ను రాముడిగా సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామనుకున్న ఫ్యాన్స్‌కి ఇది షాక్ ఇచ్చే న్యూస్. రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ వెండితెరపై కనిపించిందే లేదు. దాని తర్వాత రావాల్సిన ఆదిపురుష్‌ మాత్రం వెనక్కి వెళ్తూనే ఉంది. పోనీ ఆదిపురుష్, సలార్ రెండిట్లో ఏదో ఒక ప్రభాస్ చిత్రం వచ్చే ఏడాది ఉంటుందా.. లేదా? అనే అనుమానాలతో అభిమానుల గుండెల్లో గుబులు రేగుతోంది. మరి దీనిపై ఎంత త్వరగా క్లారిటీ ఇస్తే అంత మంచిది!

Exit mobile version