-గూగుల్‌కు ఏఐ బార్డ్ దెబ్బ
-స్టాక్ మార్కెట్లలో కుప్పకూలిన అల్ఫాబెట్ షేర్లు
విధాత: నేడు యావత్తు ప్రపంచం కృత్రిమ మేధస్సు (ఏఐ) చుట్టూనే తిరుగుతున్నది. అందుకే టెక్నాలజీ కంపెనీల దృష్టంతా ఇప్పుడు దీనిపైనే. ఏఐ ఆధారిత సేవల సృష్టికి బడా సంస్థలు సైతం పెద్ద ఎత్తునే ఖర్చు చేస్తున్నాయి. మానవ మేధస్సును మించిన అద్భుతం కోసం శ్రమిస్తున్నాయి.
అయితే ఏఐ ఆధారంగా గూగుల్ తయారుచేసిన బార్డ్.. భారీ నష్టాన్నే తెచ్చిపెట్టింది. ఓ ప్రమోషనల్ యాడ్‌లో ఇది తప్పుడు సమాధానం ఇవ్వడంతో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ స్టాక్స్ విలువ ఒక్కరోజులోనే 100 బిలియన్ డాలర్లు పడిపోయింది.
మన కరెన్సీలో ఇది సుమారు రూ.8.26 లక్షల కోట్లు కావడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే హిండెన్ బర్గ్ రిపోర్టుతో వారం రోజుల్లో అదానీ గ్రూప్ కంపెనీలు కోల్పోయిన సంపదకు కాస్త అటుఇటుగా ఒక్కరోజులోనే అల్ఫాబెట్ చేజార్చుకున్నదన్నమాట.
ఏం జరిగింది?
మైక్రోసాఫ్ట్ సారథ్యంలో రాబోతున్న చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ ఈ ఏఐ బోట్ బార్డ్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఇప్పటికే మార్కెట్‌లో చాట్‌జీపీటీ పేరు జోరుగా వినిపిస్తున్న క్రమంలో గూగుల్ తమ బార్డ్‌కూ ప్రచారం తెచ్చిపెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే బుధవారం ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ట్వట్టర్‌పై వచ్చిన ప్రమోషనల్ యాడ్‌లో బార్డ్ తప్పుడు సమాధానం ఇచ్చింది.
మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న విశ్వంలో తొలి ఫోటోను తీసింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని గూగుల్ బార్డ్ బదులిచ్చింది. అయితే నాసా వివరాల ప్రకారం ఈ ఘనత యూరోపియన్ సౌతర్న్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్ (వీఎల్‌టీ)ది.
2004లో వీఎల్‌టీ.. భూమికి చెందిన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న విశ్వానికి సంబంధించిన ఫోటోను తొలిసారిగా తీసింది. దీంతో బార్డ్ పనితనంపై అనుమానాలతో అల్ఫాబెట్ షేర్లు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది.