తాడో..పేడో: ఢిల్లీలో ధ‌ర్నాకు 1500 మంది అమ‌రావ‌తి రైతులు

అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని నిర‌స‌న విధాత‌: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గత మూడేళ్లుగా ఉద్యమాలు చేస్తూ వస్తున్న రైతులు ఇప్పుడు తమ పోరాట క్షేత్రాన్ని ఢిల్లీకి మార్చారు. కోర్టుల్లో పోరాడుతూ వస్తున్న రైతులకు ముఖ్యమంత్రి జగన్ లొంగడం లేదు. ఎవరెన్ని చెప్పినా విశాఖలోనే పాలనా రాజధాని ఉంటుందని ఆయన డిసైడ్ అయ్యారు. పైగా అమరావతిలో పనులు సైతం నిలిపి వేశారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ప్రత్యేక రైల్లో 1500 మంది రైతులు ఢిల్లీ బయల్దేరారు. […]

  • Publish Date - December 16, 2022 / 11:12 AM IST
  • అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని నిర‌స‌న

విధాత‌: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గత మూడేళ్లుగా ఉద్యమాలు చేస్తూ వస్తున్న రైతులు ఇప్పుడు తమ పోరాట క్షేత్రాన్ని ఢిల్లీకి మార్చారు. కోర్టుల్లో పోరాడుతూ వస్తున్న రైతులకు ముఖ్యమంత్రి జగన్ లొంగడం లేదు. ఎవరెన్ని చెప్పినా విశాఖలోనే పాలనా రాజధాని ఉంటుందని ఆయన డిసైడ్ అయ్యారు.

పైగా అమరావతిలో పనులు సైతం నిలిపి వేశారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ప్రత్యేక రైల్లో 1500 మంది రైతులు ఢిల్లీ బయల్దేరారు. ఈమేరకు శని, ఆది, సోమవారాల్లో జంతర్ మంతర్ వద్ద ధ‌ర్నా చేసి జాతీయ స్థాయిలో సానుభూతి, మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. వెయ్యి రోజులుగా పోరాటం చేస్తున్న రైతులు తమ గళాన్ని ఢిల్లీలో గట్టిగా వినిపించనున్నారు. రాజధాని గ్రామాల్లో ఇప్పటికే రిలే దీక్షలు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర, అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర వంటి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించినా పాదయత్ర మాత్రం మధ్యలో నిలిపివేశారు.

సీఎం జగన్.. మూడు రాజధానుల ప్రకటన చేసి ఈనెల 17వ తేదీకి మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో.. అమరావతి రైతులు ఈ యాత్ర చేపట్టారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ.. అన్ని పార్టీల ఎంపీలు జాతీయ పార్టీల అధినేతలను కలిసి అమరావతి ఆవశ్యకతతో పాటు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించనున్నారు.
18న జాతీయ పార్టీల అధినేతలు ఎంపీలను కలిసి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వివరించనున్నారు.

వాస్తవానికి తమ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపిస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే వాళ్ళసలు రైతులే కాదని, టీడీపీ కార్యకర్తలే ఈ ర్యాలీలో ఉంటున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని ప్రభుత్వం కోర్టులో వాదించింది.

ఈ నేపథ్యంలో కోర్టు పాదయాత్రకు అనుమతిస్తూ శాంతి యుతంగా పాదయాత్ర చేయవచ్చని అయితే కేవలం రైతులు మాత్రమే అది కూడా 600 మందికి మించకుండా, ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులతో మాత్రమే పాదయాత్ర చేయాలని నిబంధనలు విధించింది.

పాదయాత్రలో నినాదాలు చేయవద్దని, రైతులు కానివాళ్ళు యాత్రలో పాల్గొనవద్దని చెప్పింది. మరి ఈ నిబంధనలు సదరు రైతులకు ఎందుకు నచ్చలేదో, అసలు రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్నారో తెలీదు కానీ మొత్తానికి పాదయాత్ర నిలిచిపోయింది. కేవలం 600 మంది రైతులు గుర్తింపు కార్డులు అడిగితేనే యాత్ర నిలిపివేసి ఇప్పుడు ఏకంగా 1500 మంది రైతులు ఢిల్లీకి ఎలా వెళ్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.