విధాత: ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ఒకరోజు ముఖ్యమంత్రిగా చేస్తాడు. ఆ ఒక్కరోజూ ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అదేవిధంగా విశాఖలో మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా ఒకరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉంటారు. అంటే అన్ని వ్యవహారాల్లో కాదనుకోండి.
నేవీ డే ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటుండగా ఆ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్‌కు బదులు ఆయన హోదాలో ప్రొటోకాల్ వ్యవహారాలన్నీ గుడివాడ అమర్ చూసుకుంటారు. అంటే రాష్ట్రపతి విశాఖలో ఉన్నంత వరకూ ముఖ్యమంత్రి హోదాలో అమర్ నాథ్ ప్రొటోకాల్ ప్రకారం ఆమె వెంట ఉంటారు. అదన్నమాట సంగతి. ఈ వ్యవహారాన్ని పాలనా పరిభాషలో మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటారు.
సాధారణంగా రాష్ట్రపతికి గవర్నర్, ముఖ్యమంత్రి విమానాశ్రయంలో స్వాగతం పలకాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రపతి ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు కాకుండా విజయవాడ వస్తారు. దాంతో గన్నవరం ఎయిర్ పోర్టులోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలుకుతారు.
విజయవాడలో రాష్ట్రపతికి పౌర సన్మానం ఉంది. అలాగే ఆమెకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆతిథ్యం కూడా ఉంది. ఈ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి ఆమెతో పాటు పాల్గొంటారు. ఇక అక్కడ నుంచి ఆమె విశాఖ చేరుకుంటారు. విశాఖలో జరిగే రాష్ట్రపతి కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతలను రాష్ట్ర మంత్రి గుడివాడ అమరనాథ్ కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన హోదాను పెంచుతూ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.