విధాత: ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ తదుపరి ప్రధాని అయ్యే అవకాశం, సామర్థ్యం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అంత సానుకూల పరిస్థితులేమీ లేవని, బీజేపీ గెలిచే అవకాశాలు తక్కువేనని ఆయన అభిప్రాయ పడ్డారు.
అలాగే… వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరన్న దానిలో ప్రాంతీయ పార్టీల పాత్ర ప్రధానంగా ఉంటుందనీ అంటూ, ప్రధాని అయ్యేందుకు మమతా బెనర్జీకి అన్ని అర్హతలున్నాయని అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు.
అమర్త్యసేన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా బీజేపీ నేతల్లో అమర్త్యసేన్ వ్యాఖ్యలపై అంత ఉలికి పాటు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతల్లో అమర్త్య సేన్ మాటలపై కలవరపాటు కనిపిస్తున్నదనీ, అందుకే బీజేపీ అగ్రనేతలు వెంటనే స్పందిస్తున్నారని అంటున్నారు.
కేంద్ర మంత్రి, బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ కోలకతా శివారులో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ… దేశంలో ప్రధాని పదవి ఖాళీ లేదని ప్రకటించారు. అంతటితో ఆగకుండా… దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పుకొచ్చారు.
యువకులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు తిరిగి మోదీ పాలనే రావాలని కోరుకొంటున్నారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ గెలుస్తుందని, ఇందులో ఎవరికేమీ అనుమానాలు అవసరం లేదని తేల్చిచెప్పారు.
బీజేపీ నేతల స్పందనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతున్నది. కేంద్ర మంత్రి మాటలు వారి అభద్రతా భావాన్నే తెలియజేస్తున్నదని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరన్న చర్చ మంచిదేనని అభిప్రాయపడుతున్నారు. దీంతో నైనా దేశ ప్రగతి, దశ, దిశపై మంచి చర్చ కొనసాగే అవకాశం ఉన్నదని అంటున్నారు.