Amit Shah |
విధాత: సర్దార్ వల్లభాయ్ పటేల్‌తోనే తెలంగాణ భారతదేశంలో విలీనమైందని, రక్తం చిందించకుండా నిజాం రజాకులు లొంగిపోయేలా చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌లో విమోచన దినోత్సం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన
వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించారు. అలాగే భద్రతా బలగాల నుంచి గౌవర వందనం స్వీకరించి, ప్రజలకు అభివాదం చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
బతుకమ్మ ఆటపాటలు, కోయనృత్యాలు, డప్పు కళాకారుల ప్రదర్శనలు, బోనాలు, పోతురాజుల విన్యాసాలు, ఉగ్గు కళాకారుల ప్రదర్శనలను అమిత్ షా ఆస్తకిగా తిలకించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. హైదరాబాద్‌కు ఇవాళ విముక్తి లభించిన రోజని, తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు.
విముక్తి పోరాటంలో పాల్గొన్న యోధులకు వందనాలు తెలుపుతూ నివాళులర్పించారు. సర్దార్ వల్లాభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణ ఇంత త్వరగా విముక్తి లభించేది కాదన్నారు. పటేల్, మున్షీ కారణంగానే నిజాం పాలన అంతమైందని, ఈ క్రమలో ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలను చేశారని కొనియాడారు.
రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావుకు నివాళులర్పించారు. ఆపరేషన్ పోలో పేరుతో నిజాం మెడలు పటేల్ వంచి.. రక్తం చిందకుండా నిజాం రజాకారులను లొంగిపోయేలా చేశారన్నారు.
సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించేందుకు కారణాలు ఉన్నాయన్నారు. భవిష్యత్ తరాలకు నాటి పోరాట యోధులను గుర్తు చేయడంతో పాటు పోరాట యోధులను సన్మానించేందుకు విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారని, తెలంగాణ ఏర్పడ్డాక కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. విమోచనంపై రాజకీయాలను చేసే వారిని ప్రజలు క్షమించరని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
తొమ్మిది సంవత్సరాల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం, భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటామన్న అమిత్‌షా.. చంద్రయాన్ ప్రయోగంతో పాటు జీ20 సమ్మిట్ సైతం విజయవంతమైందని గుర్తు చేశారు. గతంలో చరిత్రను వక్రీకరించారని, కాంగ్రెస్ చేసిన తప్పులను మోదీ సరిదిద్దారన్నారు.
Hon’ble Union Minister for Home & Cooperation Sri @AmitShah ji placed a wreath at the War Memorial at Parade Ground in Secunderabad & paid floral tribute to the martyrs. #HyderabadLiberationDay pic.twitter.com/pV8JlERdz3
— G Kishan Reddy (@kishanreddybjp) September 17, 2023
మోదీ పుట్టినరోజున సేవా దివస్‌గా జరుపుకుంటున్నామని, స్వాతంత్య్ర పోరాటాన్ని సైతం కాంగ్రెస్ వక్రీకరించిందని విమర్శించారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ విమోచన చరిత్ర తెలియాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేకమైన స్వాతంత్ర్యం వచ్చిందని, లక్షలాది మంది పోరాటం చేశారన్నారు. వేలాది మంది బలిదానం అయ్యారని, భారతసైన్యం నిజాం రజాకార్లపై పోరాటం చేసి స్వేచ్ఛా స్వాతంత్ర్యం అందించిందన్నారు.
వేలాది మందిని రజాకార్లు హత్యలు చేశారని, అలాంటి రజాకర్ల నుంచి రక్షించడానికి పల్లెల్లకు పల్లెలు ఉద్యమించాయని గుర్తు చేశారు. నిజాం రజాకార్లను భారత సైన్యం ఓడించిందని, పటేల్ తెలంగాణ గడ్డపై భారత జాతీయ జెండా ఎగరేలా చేశారన్నారు. ఇది అద్భుత పోరాటమని.. దీన్ని ఎవరూ గుర్తించలేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సైతం విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని, త్యాగాల చరిత్రను తొక్కిపెట్టారని కిషన్‌రెడ్డి విమర్శించారు. భావితరాలకు చరిత్ర తెలియకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏ రకంగా సమైక్య దినం అవుతుందని నిలదీశారు.
బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం.. తుపాకీ తుటాలకు ఎదురొడ్డి చేసిన పోరాటంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, పోరాట యోధులకు తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు. కార్యక్రమం అనంతరం దివ్యాంగులకు కేంద్రమంత్రులు ట్రై సైకిళ్లు అందజేశారు.