Pushpa 2: పుష్ప2 సినిమా నిర్మాతలకు మరో గట్టి షాక్ తగిలింది. పుష్పా 2 సినిమా లాభాల్లో వాట ఇవ్వాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. పుష్ప-2 సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ లాయర్ నరసింహారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం కింద పిల్ వేశారు.
పుష్ప-2 టీమ్ కు భారీగా లాభాలు వచ్చాయని.. ఆ విషయాన్ని మూవీ నిర్మాతలే స్వయంగా ప్రకటించినట్టు ఆయన కోర్టుకు వివరించారు. కాబట్టి ఆ లాభాల్లో వాటాలను పొందే హక్కు జానపద కళాకారులకు ఉందని నరసింహారావు పిల్ లో పేర్కొన్నారు. ఇందుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పును ఆధారంగా చూపారు. అంతే కాదు పుష్ప 2 సినిమా హిట్ కు తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారం కూడా ఇందులో గుర్తుచేశారు.
తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలతో పాటు రేట్ల పెంపుకు అవకాశం ఇవ్వడం వల్లే పుష్ప2 చిత్రం భారీ లాభాలు సాధించిందని పిటిషనర్ పిల్ లో తెలిపారు. ప్రభుత్వ సహకారం తీసుకుని లాభాలు అర్జించారు కాబట్టి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం జానపద కళాకారుల పింఛన్ కోసం ఈ డబ్బుల్లో వాటా ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఇలా వాటా పొందే హక్కు సదరు కళాకారులకు ఉందన్నారు. పూర్తి వివరాలు కోరితే ఎంత మేరకు వాటా ఇవ్వాలో తెలుస్తుందన్నారు.
అయితే లాభాల విషయం ఎప్పుడో అయిపోయిన వ్యవహారం కదా అని కోర్టు ప్రశ్నించగా.. దాని కోసమే ఇప్పుడు పిల్ వేసినట్టు నరసింహారావు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి కాపీలను సమర్పించాలంటూ కోర్టు రెండు వారాల దాకా విచారణ వాయిదా వేసింది. హైకోర్టు ఈ కేసుపై విచారణ జరిపితే పుష్ప2 చిత్ర నిర్మాతలు ఇప్పుడు తమకు వచ్చిన లాభాల్ని బయటపెట్టాల్సిన పరిస్థితుల తప్పవు.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా వివాదాలు మాత్రం ఆగడం లేదు. పుష్పా 2 సినిమా బెనిఫిట్ షో చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్లిన క్రమంలో అక్కడ ఓ మహిళ చావుకు కారణమయ్యారని, ఆమె కొడుకు తీవ్ర గాయాలపాలయ్యడన్న ఆరోపణలతో కేసుల పాలయ్యాడు. చివరకు ఆయన అరెస్టు కావడం..ఓ రోజు జైలుకెళ్లడం జరిగింది. దీనిపై రాజకీయంగా రచ్చ రేగింది. ఈ వివాదం సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు హైకోర్టులో పుష్ప2 టీమ్ పై మరో పిల్ దాఖలవ్వడం హాట్ టాపిక్ గా మారింది.