విధాత: ఐసీస్ నెట్‌వర్క్ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏలోని ఉగ్రవాద నిరోధక సంస్థ సోమవారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో కర్ణాటకలో 11, జార్ఖండ్‌లో నాలుగు, మహారాష్ట్రలో మూడు, ఢిల్లీలో ఒకచోట తనిఖీలు చేపట్టింది.
గత వారం సెంట్రల్ యాంటీ టెర్రర్ ఏజెన్సీ మహారాష్ట్రలోని 40 చోట్ల దాడులు చేసి 15 మందిని అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితుల్లో ఒకరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు చెందిన నాయకుడు ఉన్నాడు. అతడు ఐసీస్‌లోకి కొత్తగా వారిని తీసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది.
ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు, ఆయుధాలు, పదునైన పనిముట్లు, సున్నితమైన పత్రాలు, వివిధ డిజిటల్ పరికరాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకున్నది. నిందితులు విదేశీ ఉగ్రవాద నేతల ఆదేశాల మేరకు భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నారని, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.