పోరు బాటలో రాలిన అరుణతార.. ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి

రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన పీడీఎఫ్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు

  • Publish Date - December 15, 2023 / 08:46 AM IST

విధాత : రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన పీడీఎఫ్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు.


అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళనలో పాల్గొని ఏలూరు నుంచి బీమవరం వెలతుండగా ఆయన కారును మరో కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షేక్ సాబ్జీని ఆసుప్రతికి తరలించే లోపునే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో నలుగురు సైతం తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


పోరు బాటలో రాలిన అరుణతార

ఉపాధ్యాయ ఉద్యమ నేత, యూటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణం హృదయాన్ని కలిచి వేసిందని ఆలిండియా అగ్రికల్చరల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ దుర్ఘటనను ఇప్పటికీ నమ్మలేకున్నానని అన్నారు. సుదీర్ఘకాలం నుంచి ఆయనతో పరిచయాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. సాబ్జీ అకాల మరణం ఆయన కుటుంబంతో పాటు ప్రజా ఉద్యమాలకు, ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమం నుండి ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను వెంకట్‌ గుర్తు చేసుకున్నారు. మరణానికి పది నిమిషాలు ముందు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు అంగనవాడిల ధర్నాలో పాల్గొని, మరోచోట ఉద్యమంలో పాల్గొనేందుకు వెళుతూ పోరు బాటలో రాలిన అరుణతారని నివాళులర్పించారు. ఆయన మృతికి వ్యవసాయ కార్మిక సంఘం తరఫున సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు, యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.