ఏపీలో ఇక గ్రామ సారథులు.. ఓట్ల వేటకు జగన్ ఏర్పాట్లు !

విధాత:  రానున్న ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించేందుకు జగన్ ఇంకో పెద్ద ప్లాన్ వేశారు. ఊళ్లలో ఒక్క ఓటు కూడా బయటికి పోకుండా అన్నీ ఫ్యాన్ గుర్తుకే వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలుకు యాభై ఇళ్లకు ఒక వలంటీర్ ను నియమించిన జగన్ ఇప్పుడు గ్రామ సారథులను పెడుతున్నారు. రానున్న ఎన్నికల యుద్ధాన్ని ఆ సారథులే నడిపిస్తారన్నమాట. ఈ మేరకు దాదాపు 5.2 లక్షల మందిని ఈ కొత్త విధుల్లో భాగస్వాములను చేస్తారు. […]

  • Publish Date - December 9, 2022 / 07:32 AM IST

విధాత: రానున్న ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించేందుకు జగన్ ఇంకో పెద్ద ప్లాన్ వేశారు. ఊళ్లలో ఒక్క ఓటు కూడా బయటికి పోకుండా అన్నీ ఫ్యాన్ గుర్తుకే వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలుకు యాభై ఇళ్లకు ఒక వలంటీర్ ను నియమించిన జగన్ ఇప్పుడు గ్రామ సారథులను పెడుతున్నారు. రానున్న ఎన్నికల యుద్ధాన్ని ఆ సారథులే నడిపిస్తారన్నమాట. ఈ మేరకు దాదాపు 5.2 లక్షల మందిని ఈ కొత్త విధుల్లో భాగస్వాములను చేస్తారు.

మొన్న పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో జగన్ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తన ప్లాన్‌ను వారికి వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వలంటీర్ల మాదిరిగానే పార్టీ కోసం 5.20 లక్షల మంది గ్రామ సారథులను నియమించాలని జగన్ పార్టీ నేతలను ఆదేశించారు. ప్రతి 50 ఇళ్లను ఓ బంచ్/ క్లష్టర్ గా పరిగణిస్తూ వాటికి ఇద్దరేసి సారథులను నియమిస్తారట.

అంతేకాకుండా వీళ్ళను సూపర్వైజ్ చేసేందుకు సచివాలయంలోనూ ముగ్గురేసి కోర్దినేటర్స్ ఉంటారు. వీళ్లంతా పార్టీ పరిస్థితి, గ్రామ స్థాయిలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం, సర్దుబాట్లు, దిద్దుబాట్లను నమోదు చేసి పార్టీపై స్థాయికి తీసుకువెళ్లడం వంటి పనులు చేస్తారు.

ఇంకా బూత్ స్థాయి నుంచి కూడా పార్టీ బలాబలాలు, ప్రత్యర్థి బలాలు, బలహీనతలు వంటివి గుర్తించి పార్టీ పెద్దలకు నివేదిస్తారు. అంటే ప్రభుత్వం తరఫున వలంటీర్లు ఎలాగైతే పని చేస్తున్నారో పార్టీ కోసం ఈ సారథులు పని చేసి పార్టీని విజయం వైపు చేరుస్తారన్నమాట. అయితే వలంటీర్లకు ఇస్తున్నట్లు వీళ్లకు జీతం గట్రా ఉంటుందా లేదా అన్నది తెలీడం లేదు.