Site icon vidhaatha

BRS కు ‘ఆరెపల్లి’ గుడ్ బై? మానకొండూర్ నుంచి పోటీకి సిద్ధం

BRS |

విధాత బ్యూరో, కరీంనగర్: సీనియర్ రాజకీయవేత్త ఆరెపల్లి మోహన్ అధికార బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఏ పార్టీలో చేరే విషయమై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్టు ఆయన ‘విధాత’కు చెప్పారు. 2019లో అధికార బీఆర్ఎస్ లో చేరిన మోహన్, పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని భావించారు. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు అన్నీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కేంద్రంగా నడుస్తున్నాయి.

దీంతో ఆరెపల్లికి కనీసం పార్టీ పేరు చెప్పుకొని నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. గ్రామస్థాయిలో వార్డు మెంబర్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, సర్పంచ్ స్థాయి నుంచి జడ్పీటీసీల వరకు పార్టీ నేతలతో కలిసే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు.

కాంగ్రెస్, బీజేపీల వైపు చూపు

నియోజకవర్గంలోని పార్టీ నేతలు ఎవరైనా ఆరెపల్లితో మాట్లాడేందుకు సాహసించినా, వారిని లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ‘ఇక అక్కడ చేయగలిగింది ఏమీ లేకపోయినా’ కనీసం రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి లేదా శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పిస్తారని మోహన్ ఇంత కాలం వేచి చూశారు.

పార్టీ టికెట్ల కేటాయింపు పూర్తి చేయగానే, ఇక అందులో నుంచి బయటపడడమే ఉత్తమమైన మార్గమనే నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే అధికార పార్టీని వీడనున్న ఆయన అవకాశం లభిస్తే కాంగ్రెస్, బీజేపీల నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విద్యార్థి దశ నుంచే..

విద్యార్థి దశలో ఎన్ఎస్ యూఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆరెపల్లి మోహన్, 1988 నుంచి 19 ఏళ్ల పాటు మానకొండూర్ సర్పంచ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. 2006లో తిమ్మాపూర్ జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికైన ఆయన, 2007 నుంచి 2009 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షునిగా పనిచేశారు.

2009లో పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన మానకొండూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విప్ గా పని చేశారు. 2014, 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆయన విజయాన్ని చవి చూడలేక పోయారు. మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ లో కొనసాగి, సర్పంచ్ నుంచి శాసనసభ్యుని వరకు ఎదిగిన ఆరేపల్లి మోహన్ 2019లో అధికార పార్టీ నేతల ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరారు.

Exit mobile version