విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం హెటిరో పారిశ్రామిక వాడలో ఉదయం నుంచి నానా హంగామా చేసిన చిరుత పులి ఎట్టకేలకు అటవీ అధికారులకు చిక్కింది. చివరకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గన్ ద్వారా మత్తుమందు ఇచ్చిన అధికారులు మత్తులోకి జారుకున్న పావుగంట తర్వాత దాన్ని బంధించారు.
తర్వాత జూకి తరలించారు. చిరుత పులి ఆ బ్లాకులో దాదాపు పది గంటలు ఉండగా రెస్కు ఆపరేషన్ దాదాపు మూడు గంటలు కొనసాగింది. మొత్తంగా ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా చిరుత బోన్ లో చిక్కింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అవడంతో హెటీరో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి డీఎఫ్ఓ శ్రీధర్ రావు మాట్లాడుతూ.. ఈ చిరుత రెస్క్యూ ఆపరేషన్ లో 30 మంది సిబ్బంది పాల్గొన్నారని, మొత్తానికి రెస్క్యూ సక్సెస్ అయ్యిందని, చిరుత మాకు ముప్పు తిప్పలు పెట్టిందన్నారు. గతంలో చేసిన రెస్క్యూ వేరు ఇప్పుడు చేసిన రెస్క్యూ పెద్ద టాస్క్ అని, చిరుత ఆరోగ్యంగా ఉందని ఆయన వెల్లడించారు.