Indian students | అమెరికాలో భార‌తీయ విద్యార్థుల మ‌ర‌ణ మృదంగం

  • Publish Date - April 11, 2024 / 04:24 PM IST

  • నాలుగు నెల‌ల్లో 11 మంది బ‌లి

  • అభ‌ద్ర‌త‌లో భార‌తీయ విద్యార్థులు

విధాత‌: 2024 నూత‌న సంవ‌త్స‌రం ప్రారంభ‌మై నాలుగు నెల‌లైనా ఇంకా పూర్తి కాలేదు. కానీ అమెరికా దేశంలో ఉన్న‌త చ‌దువుల కోసం వెళ్లిన భార‌తీయ విద్యార్థులు మాత్రం 11 మంది బ‌లైపోయారు. తాజాగా అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ (25) అనే విద్యార్థి అనుమానాస్పదంగా మరణించడం ఆ దేశంలో చదువుతున్న భారతీయ విద్యార్థుల భద్రతపై మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేసింది. అమెరికాలో చ‌ద‌వ‌డం, ఉద్యోగం సంపాదించ‌డం అనేది స‌గ‌టు భార‌తీయ విద్యార్థి క‌ల‌. దానికోసం విద్యార్థులేకాదు, వారి త‌ల్లిదండ్రులు కూడా ఎంత‌టి క‌ష్ట‌న‌ష్టాల‌కైనా ఎదురు వెళుతారు. ఈ క‌థా నేప‌థ్యంలోనే ఆ మ‌ధ్య షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టించిన ”డంకీ” సినిమా ఎంత‌గా హిట్ అయిందో చూశాం.

అమెరికాలో చ‌దువుకోసం, ఉపాధి కోసం వెళుతున్న భార‌తీయ విద్యార్థులు, ఇంకా చెప్పాలంటే మ‌న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థులు సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో అమెరికాను తమ అంతిమ గమ్యస్థానంగా మార్చుకోవాలనే క్రేజ్ ఇప్ప‌టికి కాదు. కానీ ఇలాంటి ఆశ‌లు, ఆకాంక్ష‌లతో వెళుతున్న విద్యార్థులు ఇటీవ‌ల ఆకార‌ణంగా చంప‌బ‌డుతున్నారు. వారం వ్యవధిలో అర్ఫత్ మృతి చెందడం రెండోది అయితే, నాలుగు రోజుల క్రితం, ఉమా సత్య సాయి గద్దె అనే మరో యువకుడు క్లీవ్‌ల్యాండ్‌లో అనుమానాస్ప‌ద పరిస్థితులలో మరణించాడు. వీరి త‌ల్లిదండ్రుల శోకం చెప్ప‌న‌ల‌వికానిది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించేందుకు గతేడాది అమెరికా వెళ్లిన అర్ఫత్, హైదరాబాద్‌లోని నాచారంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న తన తండ్రి మహ్మద్ సలీమ్‌కు మార్చి 7న ఫోన్ చేశాడు. అంతే ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఆర్ప‌త్ ఆచూకి కోసం వారి త‌ల్లిదండ్రులు ఎంత‌గా ప్ర‌య‌త్నం చేశారో, ఎంత న‌ర‌క‌వేద‌న అనుభ‌వించారో చెప్ప‌న‌ల‌వికాదు. అర్ఫాత్‌ను విడుదల చేయడానికి 1,200 డాల‌ర్లు (అంటే మ‌న రూపాయ‌ల్లో లక్షకు సమానం) చెల్లించాలని తెలియని నంబర్ నుండి మార్చి 19న ఒక వ్యక్తి నుండి ఫోన్‌ వచ్చింది. డ‌బ్బులు ఇవ్వ‌కుంటే అర్ఫాత్ కిడ్నీలు అమ్మి సొమ్ము రికవరీ చేస్తామని ఆ ఫోన్‌లో వ్య‌క్తి త‌ల్లిదండ్రుల‌ను హెచ్చరించాడు. పేమెంట్ మోడ్ చెప్పకుండానే కాలర్ ఫోన్ కట్ చేశాడు. తన కుమారుడితో మాట్లాడేందుకు అనుమతించాలన్న తండ్రి సలీమ్ అభ్యర్థనను కూడా అతను ప‌ట్టించుకోలేదు.

అమెరికాలోనే ఉంటున్న అర్ఫ‌త్‌ బంధువుల ఫిర్యాదు మేరకు అక్క‌డి పోలీసులు అర్ప‌త్ కోసం వేట ప్రారంభించారు. వారు ఏప్రిల్ 8న క్లీవ్‌ల్యాండ్‌లోని స‌ర‌స్సులో అతని కుళ్ళిన శరీరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు, సరస్సు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో అర్ఫత్ ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్‌ను ఒక జోగర్ కనుగొన్నాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే పోలీసు విచారణలో అర్ఫాత్ క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీ విద్యార్థి కాదని తేల‌డం. దీన్నిబ‌ట్టి అర్ప‌త్ త‌న ప్రాణాల‌కు హాని అని తెలిసి కూడా త‌క్కువ బ‌డ్జెట్‌కోసం రాజీప‌డి అక్క‌డ అన‌ధికారికంగా నివ‌శిస్తున్నార‌నే ప్ర‌శ్న ఉత్పన్న‌మైంది.

అమెరికాలో చ‌ద‌వాల‌నే క‌సి, ప‌ట్టుద‌ల ఒక‌వైపు, త‌మ పేరెంట్స్ సంపాదించే ఆదాయంలో సింహ‌భాగం త‌మ‌కే పంపాల‌నే ఆవేద‌న ఫ‌లితంగా చాలామంది భార‌తీయ విద్యార్థులు ఆయా న‌గ‌ర శివార్ల‌లో క్లిష్ట‌మైన‌, క‌ష్ట‌మైన ప‌రిస్థితుల మ‌ధ్య ఉంటున్నారు. ఇలా శివార్ల‌లో నివాసం ఉంటున్న విద్యార్థులే ల‌క్ష్యంగా దాడుల‌కు, కిడ్నాపుల‌కు, చివ‌ర‌కు చంప‌డానికి అమెరికాలోని నేర‌స్తులు తెగ‌బగ‌డుతున్నారు. ఇలాంటి చోట్ల అద్దె, హాస్ట‌ల్ ఫీజులు తక్కువ. మరోవైపు, యూనివర్సిటీ హాస్ట‌ళ్లు అత్యంత ఖ‌రీదుగా ఉంటున్నాయి. కానీ యూనివ‌ర్శిటీ హాస్ట‌ళ్ల‌లో ప్రాణాల‌కు కనీస భ‌ద్ర‌త ఉంటుంది.

అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల ప్రవేశానికి మార్గనిర్దేశం చేసే కన్సల్టెన్సీలు భద్రత కోసం క్యాంపస్‌లోనే, లేదా యూనివ‌ర్శిటీ గుర్తించిన హాస్ట‌ళ్లో ఉండాల‌ని నొక్కి మ‌రీ చెబుతారు. శివార్లలోని ప్రైవేట్ గదులు ప్రమాదకరమని మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయాలకు వెళ్లే మార్గంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను నిలిపివేసినప్పుడు నేర‌స్తుల‌కు చిక్కి ఇబ్బందులు ప‌డ‌తార‌ని కూడా విద్యార్థులకు సలహా ఇస్తారు. కానీ త‌ల్లిదండ్రుల ఆర్థిక ప‌రిస్థితులను ఆలోచించి విద్యార్థులు త‌మ ప్రాణాల‌ను రిస్క్‌లో ప‌డేసుకుంటూ ఇలా శ‌వాలుగా తేలుతున్నారు.

2024లో ఇప్పటివరకు భారతీయ విద్యార్థులు హ‌త్య‌ల పరంపరలో అర్ఫాత్ మరణం పదకొండవది. ఈ ప‌ద‌కొండు మ‌ర‌ణాల్లో ఎనిమిది మరణాలు అస‌హ‌జ‌మైన‌వే. అర్ఫత్ ను హ‌త్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా అనేది ఇంత‌వ‌ర‌కూ స్ప‌ష్టం కాలేదు. కానీ అర్ఫాత్ తన జీవితాన్ని అంతం చేసుకునే రకం కాదని తండ్రి సలీమ్ న‌మ్ముతున్నారు. ఇలాంటి మ‌ర‌ణాల విష‌యంలో అమెరికా పోలీసులు చాలామ‌టుకు నేర ప‌రిశోధ‌న పూర్తి చేయ‌కుండానే కేసులు మూసివేస్తున్నార‌ని, త‌ద్వారా వీటి వెన‌కున్న అస‌లు విష‌యాలు మరుగున‌ప‌డిపోతున్నాయ‌ని హైద‌రాబాద్‌కే చెందిన విలంబి క‌న్స‌ల్టెన్సీ సంస్థ ఎండీ ఆమంచి సురేంద్ర విధాత‌కు తెలిపారు.

అర్ఫత్ తన మొదటి, రెండవ సెమిస్టర్ పరీక్షలలో కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ కావ‌డంతో క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీ రోల్స్ నుండి తొలగించబడ్డార‌ని తేలింది. అర్ఫత్ తన కోర్సును ఆన్‌లైన్‌లో పూర్తి చేయడానికి న్యూయార్క్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడని, అయితే ఏకకాలంలో డబ్బు సంపాదించడానికి క్లీవ్‌ల్యాండ్‌లో పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకుంటున్న‌ట్లు తేలింది. క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీలో హాజరు తప్పనిసరి అయినందున, అర్ఫాత్ డబ్బు సంపాదించడం కోసం యూనివర్సిటీ క్యాంపస్ వెలుపల పని చేయడంపై దృష్టి సారించినందున అతని GPA తగ్గిందని, అందుకే అత‌నికి క్యాంప‌స్ సెల‌క్ష‌న్స్‌లో ఉద్యోగం దొర‌క‌లేద‌ని వెల్ల‌డైంది.

అర్ఫాత్ కిరాణా సామాను హ్యాండిల్‌కు వేలాడదీసి సైకిల్ నడుపుతున్న ఫోటోను క్లీవ్‌ల్యాండ్ పోలీసులు విడుదల చేశారు, అతను స్థానికంగా ఉంటూ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ, ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నాడనే పోలీసుల వాద‌న‌కు మ‌ద్ద‌తుగా అర్ప‌త్‌ కనిపించకుండా పోయే ముందు తీసిన ఆ ఫోటోను విడుద‌ల చేశారు. భారతీయ విద్యార్థులు యుఎస్‌లో నేర‌స్తుల‌కు సాఫ్ట్ టార్గెట్‌గా మారుతున్నారు. ఎందుకంటే వారు కష్టపడి పనిచేసి తక్కువ సమయంలో సంపన్నులు కావడానికి తగినంత డబ్బు సంపాదించుకుంటున్నారు. దీంతో వారిపై క‌న్నెర్ర చేస్తున్న‌వారి సంఖ్య పెరిగిపోయి, ఈ త‌ర‌హా నేరాల‌కు కార‌ణంగా ఉంటోంది.

2022-23లో అమెరికాలోని యూనివర్శిటీల్లో ప్రవేశం పొందిన భారతీయులలో అత్యధిక సంఖ్యలో తెలుగు మాట్లాడే విద్యార్థులు ఉన్నారు. భారతీయ ఇంజినీరింగ్ కళాశాలలు ప్రతి సంవత్సరం ల‌క్ష‌లాది గ్రాడ్యుయేట్‌లను ఉత్పత్తి చేస్తున్నాయని, వీరిలో చాలా మందికి దేశంలో ఉపాధి లేని కార‌ణంగా అమెరికా విశ్వవిద్యాలయాలకు ఏటా క్రేజ్ పెరుగుతోందని మ‌రో క‌న్స‌ల్టెంట్ నూర్ మ‌హ్మ‌ద్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలాంటి వారు ఉన్న‌త చ‌దువులు పూర్తి చేయ‌గానే అక్క‌డి కంపెనీలు తీసుకుని ఉపాధి క‌ల్పిస్తున్నాయ‌ని, మంచి వేత‌నాలు కూడా ఇస్తుండ‌టంతో ఈ క్రేజ్ పెరుగుతూనే ఉందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

Latest News