ఆస్ట్రేలియా ఫండ్స్‌లో అదానీ చిచ్చు.. పెన్షనర్ల డబ్బులు ఆవిరి!

గ్రూప్ కంపెనీల్లో రిటైర్మెంట్ ఫండ్స్ పెట్టుబ‌డులు షేర్ల న‌ష్టాల‌తో ఉలిక్కిప‌డుతున్న ఫండ్ మేనేజ‌ర్లు విధాత‌: అదానీ (ADANI) గ్రూప్ న‌ష్టాలు.. AUSTRALIA RETIREMENT FUNDS మేనేజ‌ర్ల‌లో గుబులు పుట్టిస్తున్నాయి. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ప‌దుల మిలియ‌న్ల‌లో డాల‌ర్లు ప్ర‌మాదంలో ప‌డ్డాయి మ‌రి. అదానీ కంపెనీల విలువ ఆక‌ర్ష‌ణీయంగా పెరుగుతుండ‌టంతో అత్యాశ‌కుపోయి ఆస్ట్రేలియాలోని ఎన్నో పెద్ద‌పెద్ద రిటైర్మెంట్ ఫండ్స్ బోలెడు పెట్టుబ‌డులు గుమ్మ‌రించాయి. ఎడాపెడా అదానీ కంపెనీల షేర్ల‌ను కొంటూపోయాయి. అయితే ఈ షేర్ల విలువ గ‌డిచిన […]

  • Publish Date - February 22, 2023 / 11:11 AM IST
  • గ్రూప్ కంపెనీల్లో రిటైర్మెంట్ ఫండ్స్ పెట్టుబ‌డులు
  • షేర్ల న‌ష్టాల‌తో ఉలిక్కిప‌డుతున్న ఫండ్ మేనేజ‌ర్లు

విధాత‌: అదానీ (ADANI) గ్రూప్ న‌ష్టాలు.. AUSTRALIA RETIREMENT FUNDS మేనేజ‌ర్ల‌లో గుబులు పుట్టిస్తున్నాయి. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ప‌దుల మిలియ‌న్ల‌లో డాల‌ర్లు ప్ర‌మాదంలో ప‌డ్డాయి మ‌రి. అదానీ కంపెనీల విలువ ఆక‌ర్ష‌ణీయంగా పెరుగుతుండ‌టంతో అత్యాశ‌కుపోయి ఆస్ట్రేలియాలోని ఎన్నో పెద్ద‌పెద్ద రిటైర్మెంట్ ఫండ్స్ బోలెడు పెట్టుబ‌డులు గుమ్మ‌రించాయి.

ఎడాపెడా అదానీ కంపెనీల షేర్ల‌ను కొంటూపోయాయి. అయితే ఈ షేర్ల విలువ గ‌డిచిన నెల రోజుల్లోనే స‌గానికిపైగా ప‌డిపోయింది. దీంతో ఇన్నాళ్లూ భారీగా పెట్టుబ‌డులు పెట్టిన రిటైర్మెంట్ ఫండ్స్ ఇప్పుడు ల‌బోదిబోమంటున్నాయి. వీటిలో క్వీన్స్‌లాండ్‌ (QUEENSLAND)లోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు చెందిన రిటైర్మెంట్ సేవింగ్స్, కామ‌న్‌వెల్త్ బ్యాంక్ సిబ్బంది ప‌ద‌వీవిర‌మ‌ణ సొమ్మును మేనేజ్ చేస్తున్న ఫండ్ మేనేజ‌ర్లూ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు ది గార్డియ‌న్ ప‌త్రిక చెప్తున్న‌ది.

అదానీ గ్రూప్‌లోని ఆరు కంపెనీల్లో బ్రిస్బెన్ (BRISBANE) కేంద్రంగా న‌డుస్తున్న ఆస్ట్రేలియ‌న్ రిటైర్మెంట్ ట్ర‌స్ట్ పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టింది. అలాగే ఆస్ట్రేలియా ఫ్యూచ‌ర్ ఫండ్ సైతం రెండు అదానీ కంపెనీల్లో 33.1 మిలియ‌న్ డాల‌ర్ల‌తో షేర్ల‌ను కొనుగోలు చేసింద‌ని స‌మాచారం. అయితే భార‌తీయ స్టాక్ మార్కెట్ల‌లో అదానీ షేర్లు కుప్ప‌కూలుతున్న నేప‌థ్యంలో ఈ పెట్టుబ‌డుల‌పై ఆయా సంస్థ‌లు ఆందోళ‌న చెందుతున్నాయి.

మ‌రోవైపు అదానీ గ్రూప్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టిన ఏ ఫండ్ మేనేజ‌రైనా.. క్లెయిముల‌ను చేయ‌క‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అక్క‌డి మార్కెట్ రెగ్యులేట‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. దీంతో ఫండ్ మేనేజ‌ర్ల‌లో మ‌రింత భ‌యం నెల‌కొంటున్న‌ది.

అమెరికా షార్ట్ సెల్ల‌ర్ హిండెన్‌బ‌ర్గ్ (HINDENBURG) గ‌త నెల 24న అదానీ స్టాక్స్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, ఇదో బ‌డా కుంభ‌కోణమంటూ ఓ సంచ‌ల‌న రిపోర్టును విడుద‌ల చేసినది తెలిసిందే. అప్ప‌ట్నుంచి అదానీ కంపెనీ షేర్లు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాయి. ఇప్ప‌టిదాకా గ్రూప్ మార్కెట్ విలువ 130 బిలియ‌న్ డాల‌ర్ల‌పైనే దిగ‌జారింద‌ని అంచ‌నా.