ఉపాధి కోల్పోతున్నాం.. ఆదుకోండి: రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు

రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు

  • Publish Date - December 12, 2023 / 12:12 PM IST

విధాత ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో చేపట్టారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయడంతో తమకు గిరాకీ ఉండడం లేదని పేర్కొన్నారు.


ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆటోల పైనే ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఆటో డ్రైవర్లను సైతం ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆటో డ్రైవర్లకు జీవన భృతి నెలకు రూ.15 వేలు చెల్లించాలని, ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Latest News