Balagam | తెలంగాణ ప‌ల్లెల్లో సంచలనం సృష్టించిన ‘బలగం’

ఉన్న‌మాట‌: ఈ సంవత్సరం మార్చి మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల‌లో అనేక సినిమా థియేటర్లలో బలగం (Balagam) సినిమా విడుదలై బాగా నడిచింది. ప్రేక్ష‌కుల‌ మనసులపై చెరగని ముద్రవేసింది. ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో ప్రజలాదరాభిమానాలను చూరగొని, ప్రేక్ష‌కుల‌ మెప్పును పొందింది. బలగం సినిమాలో ఏ కారణాలు, ఏ భావాలు తెలంగాణా ప్రజలను ఇంతగా ఆకట్టుకున్నాయో, ఆకర్షించాయో మనం కొంత వివరంగా మాట్లాడుకొందాం. ఏ సినిమాకు అయినా దాని స్టోరీయే ప్రాణం. మరి బలగం సినిమాకు కూడా దాని […]

  • Publish Date - June 6, 2023 / 08:35 AM IST

ఉన్న‌మాట‌: ఈ సంవత్సరం మార్చి మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల‌లో అనేక సినిమా థియేటర్లలో బలగం (Balagam) సినిమా విడుదలై బాగా నడిచింది. ప్రేక్ష‌కుల‌ మనసులపై చెరగని ముద్రవేసింది. ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో ప్రజలాదరాభిమానాలను చూరగొని, ప్రేక్ష‌కుల‌ మెప్పును పొందింది. బలగం సినిమాలో ఏ కారణాలు, ఏ భావాలు తెలంగాణా ప్రజలను ఇంతగా ఆకట్టుకున్నాయో, ఆకర్షించాయో మనం కొంత వివరంగా మాట్లాడుకొందాం.

ఏ సినిమాకు అయినా దాని స్టోరీయే ప్రాణం. మరి బలగం సినిమాకు కూడా దాని కథే ప్రాణం పోసింది. చాల సింపుల్ కథాసారాంశం బలగం సినిమా కథ. అది తెలంగాణలోని ఒక పల్లె. ఆ పల్లెలో కొమరయ్య అనే రైతు. అతనికి ముగ్గురు కొడుకులు- అయిలయ్య, మొగిలయ్యబాటు ఒక బిడ్డ లచ్చవ్వ ఉంటారు.. అయిలయ్య కొడుకు సాయిలు (ప్రియదర్శి). లచ్చవ్వకు భర్త ఒక బిడ్డ. కొమరయ్యకు ఒక చెల్లెలు, ఆమె భ‌ర్త లేక‌పోవ‌డంతో కొముర‌య్య ఇంట్లోనే ఉంటుంది. మొత్తంగ పెద్ద ఉమ్మడి కుటుంబమే కొమరయ్య వెనుక ఉంటుంది.

అలా ఆ గ్రామ సాధారణ రైతు పాత్ర‌లో కొమరయ్య వెండి తెరపై కొద్దిసేపే ఉన్నా, ఆ పాత్రకు వున్న ప్రాధాన్యతను బట్టి ప్రేక్షకుల మనస్సుల్లో సినిమా చివరి వరకు సజీవంగా కనబడుతూ మనతో మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తుంది. కొమరయ్య ఒక ప్రత్యేక గుణ గణాలు కలిగిన వ్యక్తి. అతను తెల్లవారు జామున ఊరుకన్నా ముందే లేచి పొలాల వైపు వెళ్లుతూ, వస్తూ ఎదురుబడ్డ‌ ఆడ, మగ వారితో హాస్యోక్తులు , ఛలోక్తులు సందర్భానుసారంగా విసురుతూ రసవత్తరంగా ఆకట్టుకుంటాడు. కొమరయ్య పాత్ర పల్లె పని -పాటల్లో, గ్రామీణ వాతావరణంలో నిత్యం మనకు కనిపించే వ్య‌క్తుల‌ప్రతి రూపం.

కొమరయ్య పొలం నుండి తిరిగివస్తూ ఊరివారందరూ పరుగులుతీస్తూ ఏదో చూడటానికి వెళ్ళుతూ ఉండటాన్ని గమనిస్తాడు. అర్థంకాని కొమరయ్య అయోమయంగా చూస్తూ ఒకరిని అడిగితే.. ఫలాన అన్నదమ్ములు ఆస్తుల గొడవలతో కొట్టుకుంటున్నారు అని చెప్పగా కొమరయ్య చింతలో పడతాడు. తన కుటుంబం కూడా తను పోయిన తరువాత ఇలానే కొట్టుకుంటారని ఊహించుకొంటూ తీవ్ర బాధకు లోను అవుతాడు.

ఆ తరువాత తన కుటుంబాన్ని సమావేశపరిచి మీరు కొట్టుకోవద్దని, కలసి ఉండాలని వారికి హితబోధ చేస్తూ వారి అందరి నుండి కలసి ఉంటామని ఒట్టు పెట్టించుకుంటాడు. అలా ఉన్నట్టుండి ఒక రోజు ఆకస్మాత్తుగా కొమరయ్య చనిపోగా ఆయన దహన సంస్కరణలు పూర్తి చేసి దిన వారాల సందర్భంగా కాకులు పిండం
ముట్టే విషయం పై ఈ సినిమా సాగుతుంది.

పిండం కాకులు ముట్టక పోవడంతో..

కొమరయ్య పిండం కాకులు ముట్టక పోవడంతో ఆ కుటుంబంలోనూ, ఆ గ్రామంలోనూ ఉద్రిక్తతలు నెలకొంటాయి. అయితే ఇలా దాదాపు మన చూట్టుతా సామాన్యంగా జరిగే గ్రామీణ ఘటనలను ఒక వరుస క్రమంలో పెట్టి. అవి మన ఇంట్లోనో మన పోరుగింట్లోనో లేదా, మన గ్రామంలోనో ప్రస్తుతం మన కళ్ళ ముందు యథార్థంగా జరుగుతున్నట్లుగా ఈ సినిమాను మనం చూస్తూన్నంత సేపు ఏదో తెలంగాణా గ్రామంలో మనం సాక్షాత్ ఉన్నట్లుగా అనిపిస్తుంది.

తెలంగాణా పల్లెల్లో వున్న సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను కళ్లకు కట్టినట్టు కళాత్మకంగా రక్తి కట్టించేలా చిత్రీక‌రించి ప్రేక్షకుల హృదయాల్లో భావోద్రేకాలను రేకెత్తించ‌డంలో ద‌ర్శ‌కులు వేణు స‌క్సెస్ అయ్యారు. ప్రేక్ష‌కుల‌హృదయాలను అనుభూతులతో నిలువెల్లా ముంచెత్తి భారమైన వారి గుండె చప్పుల్లలో మౌనంగా ఉబికి వచ్చే వెచ్చని కన్నీళ్ళ జల్లు జల జల రాలే విధంగా ఈ సినిమా సీన్లు మనని క్షణ,క్షణం ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. .

అంతేకాదు బలగం సినిమాలో చావు సంస్కారాలతోబాటు మన సమాజంలో వేళ్ళూనుకొని వున్నకొన్ని న‌మ్మ‌కాల‌ను, మూఢ న‌మ్మ‌కాల‌ను అర్ధం చేసుకొనే విధంగా మన ముందుంచారు . గ్రామీణ జీవితంలో సాదరణంగా పెండ్లీ పబ్బాల వద్ద పెట్టిపోతలు, తినేతాగే దగ్గర చీటికి మాటికి చిల్లరమల్లర విషయాలలో తగువులాడుకోవడం సహజం .అలాగే బలగం సినిమాలో కూడా ఇలా గొడవ పడే కొమరయ్య అల్లుడు భార్య లచ్చవ్వను ఏళ్ళతరబడి పుట్టింటికి రాకుండా హద్దులు పెట్టి అలా ఆ రెండు కుటుంబాలు తీవ్ర మానసిక వత్తిడికి గురిఅయ్యే విధంగాచేస్తాడు.

అలాగే ఇంకో సన్నివేశంలో కొమరయ్య మనుమడు సాయిలు(ప్రియదర్శి) తీవ్ర అప్పుల్లో కూరుకపోయి వాటినుండి బయట పడడానికి గాను పెండ్లీ , వరకట్నంను అప్పులు తీర్చేమార్గంగా ఎంచుకొంటాడు . అలాగే ఆ సినిమా చివరి సీనులో కొమరయ్య పిండం అప్పటికే రెండవసారి కూడా కాకులు ముట్టకపోవడంతో ఆందోళనలలోమునిగివున్న ఆ కుటుంబాన్నిమూడవసారికూడా ముట్టక పోతే మీ కుటుంబాన్ని ఊరినుండి వెలివేస్తామని గ్రామపెద్దలు ఒక్కటై బెదిరిస్తారు.

ఈ సినిమాలో తమ కుటుంబ ఐక్యత కోసం అహర్నిశలు పాటుబడే తన తాతను కోల్పోవడంతో మనుమడు క్లైమాక్స్ లో ఎంత పెద్ద తప్పు చేశానో, త‌న స్వార్థం కోసం తాత చావును వాడుకొన్నానని ప‌శ్చాత్తాప‌ ప‌డ‌తాడు. ఇంక తాత కనిపించడు ,అని మనుమడు ఏడుస్తూంటే చూస్తున్న వాల్ల కళ్ళల్లో కూడా కన్నీళ్లు వస్తాయి.

కొమరయ్య పిండం కాకులు ముట్టేందుకు మూడవ సారి చేసే ప్రయత్నంలో భాగంగా అంటే 11వ రోజు బుర్రకథ చెప్పుతూ ఆ కుటుంబంలోని ఒక్కోమనిషి గురించి పాటల రూపంలో ఎలా నడుచుకోవాలో, కుటుంబ గౌరవ, మర్యాదలను ఎలా పాటించాలి, బిడ్డల ఆలనా,పాలనా ఎలా చూసుకోవాలి, మనుషుల మధ్య ఉండాల్సిన విలువలు, బంధాలు భాంధవ్యాలు ఒకటేంటి అన్నీ కూలంకషంగా చెప్పుతారు.

అదే విధంగా అన్నదమ్ముల , అక్కచెల్లెల్ల మధ్య‌ఆప్యాయతల గురించి చెప్పుతూ ఉత్కృష్ఠ కళా విలువలతో అల్లిన ఆ చివరి 15 నిముషాల ప్రతి సన్నివేశం ప్రతి ఒక్కరి హృదయాన్ని చలింపచేస్తుంది . కన్నీళ్ళు పెట్టిస్తుంది .కళా ప్రపంచంలో మన బాధలు , నిస్పృహలతోబాటు వెన్నుతట్టి అవి మన కర్తవ్యాలను గుర్తు చేస్తుంటాయి.

చాలా వరకు నేటి మన సినిమాలు గొప్ప హీరో హీరోయిన్ లతోబాటు పేరుమోసిన నటీనటులతోనూ పెద్ద ఆడంబరాలు, హంగామాలతోనూ భారీ సెట్టింగులు ,ఓవర్ మేకప్ లు, మితిమీరిన ప్రేమాలాపాలు మరియు డబుల్ మీనింగ్స్ డైలాగులతో కూడి మార్కెట్ పోటిలో కేవలం డబ్బు సంపాదించే చిట్కాలతో కూడుకొని వుంటాయి. అయితే బలగం సినిమా మాత్రం వీటన్నిటికి దూరంగా ఆ ఆర్భాటాలు ఏమిలేకుండా ఎన్నో ప్రత్యేకతలతో జతకూడి స‌హ‌జంగా తీశారు.

కాగా.. ఇందులో పేరున్న నటీనటులు ఎవరూ లేరు . భారీ హంగామా సెట్టింగ్ లు అసలే లేవు. బలగం నూటికి నూరుపాళ్ళు సహజంగా వుండే తెలంగాణా పల్లె ప్రాంతాల్లో నిర్మించబడిన చిత్రం ఇది. ఇక నటీనటుల గురించి వస్తే ఈ సినిమాలో ఎక్కువ మంది కొత్తవారు నటించారు. అసలు వాల్లంతా నటులా లేక సాధారణంగా ఆ గ్రామంలోవున్న మనుషులను యధావిధిగా ఇందులో పెట్టారా అన్నంత సహజంగా నటించారు . అక్కడ పాత్ర మాత్రమే కనబడుతుంది తప్ప అది ఎవరు చేసారు అన్నది కనిపించదు. అంతలా ఆ పాత్రలో ప్రతిఒక్కరూ ఇమిడి పోయారు.

ప్రియదర్శికి ఇది ఒక మంచి పాత్ర.. చాలా చక్కగా ఆ పాత్రలో అమిరిపోయాడు. అలాగే హీరోయిన్ కావ్యకల్యాణ్ రామ్ కూడా మరదలుగా చాలా బాగా చేసింది. మామూలు సినిమాలో చూస్తున్నట్టుగా ఇందులో కథానాయిక వుండదు, కాని సహజంగా వుంటుంది. ఆమె పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఆమె చెప్పే రెండు, మూడు మాటల వలన ఆమె తండ్రి తన నడివడి మార్చుకొంటాడు.

ఇంకా రచ్చరవి పాత్ర కూడా ప్ర‌భావ‌వంత‌మైన‌దేకాదు, ఆలోచింప‌జేసేది. రెండు నిమిషాలు ఆగుతావా అంటూ ఒక మేనరిజంతో అందరిని నవ్విస్తాడు. ల‌చ్చ‌వ్వ పాత్ర ధ‌రించిన రూపలక్ష్మి కూడా కూతురుగా బాగా చేసింది .కొమరయ్యగా సుధాకర్ రెడ్డి ఆ పాత్రకు ఫిట్ అయ్యాడు. కొమరయ్య పెద్ద కొడుకు,చిన్నకొడుకు చెల్లెలు చిన్నకోడలు ఇలా ఒకరేమిటి ఊరు ప్రజలు అందరూ తమ పాత్రలకు పూర్తి జీవం పోశారు.

అలాగే బలగం సినిమాను ప్రజల ముందుకు తీసుక రావడానికి తెర వెనుక చాల మందే క‌ష్ట‌ప‌డ్డారు. అటువంటి వారిలో ఈ సినిమా డైరెక్టర్ అయిన వేణు వెల్దండి ఒకరు .అతను ఈ సినిమాకు కర్త, కర్మ ,క్రియ అని చెప్పవచ్చు. గతంలో జబర్దస్తీ టి.వి షో లో బాగా పాపులర్ అయిన నటుడు వేణు వెల్దండి తన కెరీర్ లో డైరెక్టర్ గా మొదటిసారి ఈ సినిమాతో పరిచయం అయ్యాడు. డైరెక్టర్ వేణుకమేడియన్‌గా అందరికి పరిచయం కాబట్టి తన మార్కును ఈ సినిమాలో టైలర్ నర్సి పాత్రతో అలరించాడు. కాకి చుట్టు లేదా చనిపోయిన కొమరయ్య చుట్టూ కథ అల్లాడు.

చిన్న కాకిని పట్టుకొని వేణు ఒక గ్రామానికి సంబంధించి, ఒక ప్రాంత ఆచార వ్య‌వ‌హారాల‌కు సంబంధించి, మానవీయ విలువలను, కుటుంబ అనుబంధాలను అద్భుతంగా తెర‌కెక్కించారు. సామాజిక ఆదర్శాల సారాంశాన్ని సరళంగా విడమరిచి చూపిన చిత్రం ఇది. తెలంగాణ ప‌ల్లెల్లో ఒక‌ప్ప‌టి తోలు బొమ్మ‌లాట‌ల లెక్క పెద్ద టీవీ తెర‌ల‌పై వీధంతా కూర్చుని చూసిన సినిమా బ‌ల‌గం. భవిష్యత్ లో బలగంలాంటి సామాజిక‌, కుటుంబ సందేశాల‌తో కూడిన సినిమాలు వస్తాయని ఆశతో ఎదురుచూద్దాం.

– గ‌జ్జెల స‌త్యంరెడ్డి

Latest News