రామేశ్వ‌రం కేఫ్‌లో బాంబు బ్లాస్ట్.. ఆ 86 నిమిషాల్లో ఏం జ‌రిగిందంటే..?

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు న‌గ‌రంలోని రామేశ్వ‌రం కేఫ్‌లో నిన్న మ‌ధ్యాహ్నం 12:56 గంట‌ల స‌మ‌యంలో బాంబు బ్లాస్ట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే

  • Publish Date - March 2, 2024 / 08:13 AM IST

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు న‌గ‌రంలోని రామేశ్వ‌రం కేఫ్‌లో నిన్న మ‌ధ్యాహ్నం 12:56 గంట‌ల స‌మ‌యంలో బాంబు బ్లాస్ట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ పేలుడు ధాటికి మంట‌లు చెల‌రేగి, 9 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కేఫ్‌లో గ్యాస్ సిలిండ‌ర్ పేల‌లేద‌ని, బాంబు బ్లాస్ట్ జ‌రిగింద‌ని క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వం క‌న్ఫార్మ్ చేసింది.


అయితే వైట్ క‌ల‌ర్ క్యాప్ ధ‌రించిన ఓ యువ‌కుడు కేఫ్‌లో బాంబు ఉన్న బ్యాగు పెట్టి వెళ్లిన‌ట్లు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ యువ‌కుడు కేఫ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన కాసేప‌టికే బాంబు పేలుడు సంభ‌వించిన‌ట్లు తేలింది. అయితే ఆ యువ‌కుడు బ్యాగుతో కేఫ్‌లోకి వ‌చ్చి.. పేలుడు జ‌రిగే వ‌ర‌కు 86 నిమిషాల స‌మ‌యం ప‌ట్టింద‌ని పోలీసులు తేల్చారు.


కేఫ్‌లో బాంబు బ్లాస్ట్.. మినిట్ టు మినిట్


ఉద‌యం 11:30 – అనుమానితుడు బ‌స్సు దిగి కేఫ్‌లోకి రావ‌డం..

ఉద‌యం 11:38 – కౌంట‌ర్ వ‌ద్ద ర‌వ్వ ఇడ్లీ ఆర్డ‌ర్ చేశాడు.

ఉద‌యం 11:44 – కేఫ్‌లోని హ్యాండ్ వాష్ ఏరియాకు చేరుకున్నాడు. అక్క‌డే ఓ బ్యాగును వ‌దిలిపెట్టాడు.

ఉద‌యం 11:45 – కేఫ్‌లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు.. కేఫ్ ముందున్న ఫుట్‌పాత్‌పై నుంచి వేగంగా ముందుకు న‌డిచాడు.

మ‌ధ్యాహ్నం 12:56 – ఈ స‌మ‌యంలో బాంబు బ్లాస్ట్ జ‌రిగింది.


అయితే అనుమానితుడు కేఫ్ ముందున్న ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ ఫోన్‌లో మాట్లాడుతున్న‌ట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. అత‌ను ఎవ‌రితో మాట్లాడ‌ర‌నేది తేలాల్సి ఉంద‌ని పోలీసులు పేర్కొన్నారు. ఆ కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు చెప్పారు. అనుమానితుడు త‌ల‌కు క్యాప్ పెట్టుకోవ‌డం, ముఖానికి మాస్కు ధ‌రించ‌డం, క‌ళ్ల‌ద్దాలు పెట్టుకోవ‌డంతో అత‌న్ని గుర్తుప‌ట్ట‌డం కొంచెం క‌ష్టంగా మారిందని పోలీసులు తెలిపారు.


వీలైనంత వ‌ర‌కు అత‌న్ని గుర్తిస్తామ‌ని తెలిపారు. బ్లాస్ట్ జ‌రిగిన ఏరియాలో టైమ‌ర్‌తో పాటు ఇత‌ర ఆధారాల‌ను పోలీసులు సేక‌రించారు. అనుమానితుడి వెంట ఉన్న మ‌రో వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Latest News