రిజర్వేషన్ల పెంపు బిల్లుకు బీహార్‌ అసెంబ్లీ ఆమోదం

  • Publish Date - November 9, 2023 / 10:39 AM IST

విధాత : బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65శాతంకు పెంచుతూ రూపొందించిన రిజర్వేషన్ సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదంతో రిజర్వేషన్ కోటా ఇకపై 65 శాతం పెరగనుంది. కుల గణన తర్వాతా రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన తరగతులు, ఎస్సీలు, ఎస్టీల రిజర్వేషన్ల కోటాలను పెంచే ప్రతిపాదనలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్‌ సవరణ బిల్లు మేరకు మొత్తం రిజర్వేషన్లు 50శాతం నుంచి 75శాతానికి పెరుగనున్నాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 65శాతం రిజర్వేషన్లు అమలుకానున్నాయి. ఓబీసీ రిజర్వేషన్లు 30శాతం నుంచి 43శాతానికి పెరుగనుంది. ఎస్సీలకు 16నుంచి 20 శాతం, ఎస్టీలకు 1శాతం నుంచి 2 శాతం కోటా పెరగనుంది. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని దాటిపోయాయి. సవరించిన బిల్లు చట్టరూపం దాల్చడానికి ముందు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆమోదం మాత్రమే మిగిలింది.