విధాత: విదేశీ వ్యవహారాలు, పొరుగు దేశాలతో సంబంధాల విషయంలో సమస్య తలెత్తినప్పుడల్లా బీజేపీ గత కాంగ్రెస్ పాలనను, ముఖ్యంగా నెహ్రూను తప్పుపట్టడం పరిపాటిగా మారింది. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యల విషయంలో మోదీ ప్రభుత్వం సర్వత్రా విఫలమవుతున్న నేపథ్యంలో, ఆ తప్పును ఇతరులపై నెట్టి తప్పించుకో జూస్తున్నది.
నేపాల్, భూటాన్ లాంటి చిన్న దేశాలతో కూడా సుహృద్భావ సంబంధాలను నెరపడంలో మోదీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. అయినా… సమయం వచ్చినప్పుడల్లా నెహ్రూను తప్పుపడుతూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు బీజేపీ నేతలు విఫల ప్రయత్నం చేస్తున్నారు.
డోక్లాం, గాల్వాన్ లోయ ఘటనలు మరువక ముందే, ఈ మధ్య భారత్-చైనా సరిహద్దులో వివాదం చెలరేగింది. వాస్తవాధీన రేఖను దాటి చైనా సైనికులు భారత భూ భాగంలోకి చొచ్చుకు వచ్చిన క్రమంలో వారిని, భారత సేనలు నిలువరించి వెనక్కి పంపడటంతో తీవ్ర గలాట జరిగింది. ఇరువైపులా ప్రాణనష్టం జరుగకున్నా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ సమస్య ముందుకు వచ్చి… అది రాకపోవటానికి నెహ్రూ యే కారణమని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. 1955లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తామన్నా నెహ్రూ వద్దని, దాన్ని చైనాకి ఇవ్వాలని కోరాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చరిత్రను, సందర్భాన్ని వక్రీకరించటం అంటే ఇదే. నాడున్న పరిస్థితుల్లో నెహ్రూ ఏమి చేశాడన్నది చెప్పకుండా బట్టకాల్చి మీదేయటం లాగా నిరాధార ఆరోపణలు చేయటంలో బీజేపీ నేతలది ఆరితేరిన విద్య. నిజానికి ఐక్యరాజ్యసమితి (యూఎన్ ఓ) 1945లో ఏర్పడింది. అప్పటికి భారత్‌కు స్వాతంత్రమే సిద్ధించలేదు.
1947లో భారత్ స్వతంత్ర దేశమైతే.., చైనా 49లో మావో నేతృత్వంలో నవ చైనా ఏర్పడింది. చైనాలో వచ్చిన ప్రజా విప్లవం నేపథ్యంలో నాటి పాలకుడు చాంగ్‌కాయి షేక్ తైవాన్‌కు పారిపోయి రిపబ్లిక్ ఆఫ్ చైనాను ప్రకటించుకున్నాడు. నాటి అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా, ఇంగ్లండ్ ఇంకా ఇతర యూరప్ పెట్టుబడిదారీ దేశాలు మావో నాయకత్వంలోని నవచైనాను గుర్తించటానికి నిరాకరించి చాంక్ కాయి షేక్ పాలకుడుగా ఉన్న తైవాన్‌ను గుర్తించే ప్రయత్నం చేశాయి.
చరిత్ర, ప్రపంచ పరిణామాలు, సామాజిక పురోగమనం పట్ల అవగాహన ఉన్న నెహ్రూ మావో నాయకత్వం లోని చైనానే గుర్తించాలని పట్టుపట్టాడు. ప్రపంచ భౌగోళిక, రాజకీయ సమీకరణల నేపథ్యంలో చైనాకు భద్రతా మండలిలో సభ్యత్వం ఇవ్వాలని ప్రపంచ దేశాలకు సూచించాడు. ఆ నేపథ్యంలోంచే చైనాకు శాశ్వత సభ్యత్వం లభించింది.
అలాగే… ఈ విషయంపైనే 1955 సెప్టెంబర్ 27న పార్లమెంటులో విస్పష్ట ప్రకటన చేశాడు. భారత దేశానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చే ప్రతిపాదన అనేది రానే రాలేదని తెలిపాడు. అయినా అది ఎవరో కోరుకుంటే వచ్చేది కాదనీ, అదొక సుదీర్ఘ ప్రక్రియ అని ప్రకటించారు. యూఎన్ చార్టర్ ఆధారంగా ఏర్పడిన ఐక్యరాజ్యసమితిలో ఎవరికైనా సభ్యత్వం ఇవ్వాలంటే.. దానికి సర్వప్రతినిధి సభ ఆమోదం తెలపాలి. శాశ్వత సభ్యదేశాల ఆమోదం ఉండాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యం.
అయితే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా లాంటి దేశాలు భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వటానికి తమ సమ్మతిని తెలిపాయి. మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికాను వెనక్కు నెట్టి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాను నిలువరించే ఎత్తుగడలో భాగంగా జరుగుతున్న వ్యూహాత్మక రాజకీయాలుగా వీటిని చూడాల్సిన అవసరం ఉన్నది. అంతే కానీ.. వర్తమాన సమస్యలకు గత పాలకులను, ముఖ్యంగా నెహ్రూను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయటం అసంబద్ధం, గర్హనీయం.