విధాత: డబుల్ బెడ్ రూమ్(Double bedroom) ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలు అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారిని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ (BJP) ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ కలెక్టరేట్ (Nalgonda Collectorate) వద్ద ధర్నా నిర్వహించారు ధర్నాలో మున్సిపాలిటీలను డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తుదారులు బీజేపీ శ్రేణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి(Kankanala Sridhar Reddy) నాయకులు నాగం వర్షిత్ రెడ్డి (Nagam Varshit Reddy), మాద గోని శ్రీనివాస్ గౌడ్ (Mada Goni Srinivas Goud)లు మాట్లాడుతూ .. అధికార బీఆర్ఎస్ పార్టీ వారు చెప్పిన వారికి మాత్రమే అర్హులుగా ఎంపిక చేసి డ్రా నిర్వహించారని, ఎంపికైన లబ్ధిదారుల్లో మెజారిటీ లబ్ధిదారులు అనర్హులుగా ఉన్నారని ఆరోపించారు. అక్రమ పద్ధతిలో సాగిన డబుల్ బెడ్ రూమ్(Double bedroom ) ఇండ్ల కేటాయింపుపై రీ సర్వే (Re survey) చేపట్టాలని, అర్హుల జాబితాకు సరైన గైడ్లైన్స్ రూపొందించాలని, వితంతు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఎంపికైన లబ్ధిదారుల జాబితాపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 13,240 మంది దరఖాస్తు దారులకు 4210 మందినే డ్రాకు ఎంపిక చేసి, వార్డుల వారిగా డ్రాలు వేసి, మొత్తం మున్సిపాలిటీలో 550 మందికే ఇళ్ల కేటాయింపు చేయడం, అందులోను అనర్హులు, అధికార పార్టీ వారే ఎక్కువ మంది ఉండటంతో మెజారిటీ పేదలకు అన్యాయం జరిగిందన్నారు.
ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులందరికీ కట్టించడంతోపాటు సొంత స్థలాలు ఉన్నవారికి ఇస్తామన్నా మూడు లక్షలను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం అందిస్తున్న పీఎం ఆవాస్ యోజన నిధులు ఐదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం పొందకుండా పేదలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్రం ఏటా లక్ష ఇండ్లను పీఎం ఆవాస్ యోజన (PM Awas Yojana) కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పిందని, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతో అవి పేదలకు అందకుండా పోతున్నాయి అన్నారు. పీఎం ఆవాస్ యోజన నిధులతో మరింత మంది పేదలకు ఇంటి వసతిని కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, నాగేశ్వర్ రావు, వీరెల్లి చంద్రశేఖర్, కర్నాటి సురేష్ కుమార్, కన్మంతా రెడ్డీ శ్రీదేవి రెడ్డీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దాశోజు యాదగిరా చారి, నిమ్మల రాజశేఖర్ రెడ్డి, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి చర్ల పల్లి గణేష్ , ఆవుల మధు, కొండేటి సరిత, రావెళ్ళ కాషమ్మ, నేవర్శు నీరజ, వివిధ మోర్చల పదాదికరులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.