నాడు వెలగలేదు.. నేడు వికసించలేదు!

ఎన్నికల వేళ ప్రజల్లోకి తన పథకాలను తీసుకుపోయేందుకు, జనం నాడి పట్టుకునేందుకు బీజేపీ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర చేపట్టింది.

  • Publish Date - January 16, 2024 / 12:05 PM IST
  • ఎన్నికల వేళ బీజేపీ ‘వికసిత్‌ భారత్‌’
  • ప్రజా స్పందన తెలుసుకునేందుకే?

(విధాత ప్రత్యేకం)

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర అసలు ఉద్దేశం.. ప్రభుత్వంపై ప్రజా స్పందన తెలుసుకునేందుకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్రం చేపట్టిన చర్యలను వివరించేందుకు ఈ యాత్ర రూపొందించినట్టు కమలనాథులు చెబుతున్నారు. ‘ఆదివాసీ గౌరవ్‌ దివస్‌’ నవంబర్‌ 15న దీన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ యాత్ర దేశంలోని 24 రాష్ట్రాల్లోని 68 జిల్లాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ సాగుతుంది. దేశవ్యాప్తంగా 8,500 పైగా గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు తదితర సమాచారాన్ని అట్టుడుగుస్థాయి వర్గాల ప్రజలకు వివరిస్తున్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి నుంచి సూచనలు, సలహాలు సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటున్నారు. ఈ ఏడాది జరగనున్నఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ యాత్ర చేపట్టిందని పరిశీలకులు అంటున్నారు.


భారత్‌ జోడో యాత్రతో అలర్ట్‌

ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రనుంచి ప్రజల దృష్టి మళ్లించడం కూడా ఒక కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాహుల్‌ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ నిర్వహించిన భారత్‌ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విద్వేష రాజకీయాల వల్ల భారత్‌ అంతర్జాతీయ స్థాయిలో అప్రతిష్ఠపాలవుతున్నదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఒక వర్గంపై చూపిస్తున్న వివక్షపై ప్రధాని మౌనం వీడాలని, తన సహచరులను హెచ్చరించాలని దేశంలోని మేధావులు, రిటైర్డ్‌ సుప్రీం, హైకోర్టు జడ్జీలు, ఐపీఎస్‌, ఐఏఎస్‌లు కూడా ప్రధానికి బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. బీజేపీ విధానాలను వ్యతిరేకించిన కర్ణాటక ప్రజలు.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం మిగిల్చారు. అక్కడ మత విద్వేషాల ద్వారా లబ్ధి పొందాలన్న బీజేపీ పాచిక పనిచేయలేదు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో గెలిచినా కాంగ్రెస్‌ స్థానిక నాయకత్వ సమన్వయం లోపం వల్ల బీజేపీ అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలోనూ బీజేపీ ఆశించిన సీట్లు రాలేదు. దేశవ్యాప్తంగా తమ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్ల రానున్న ఎన్నికల్లో నష్టం తప్పదని బీజేపీ గ్రహించిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


జనం నాడి తెలుసుకోవడానికే

‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌’ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయన్నది అవగతం చేసుకుని దానికి అనుగుణంగా వచ్చే ఎన్నికల నాటికి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నది రహస్య అజెండా అని చెబుతున్నారు. ఈ యాత్ర కొనసాగుతుండగానే అయోధ్యలో రామ మందిర అంశాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రచారంగా వాడుకోవడానికి బీజేపీ సిద్ధమైంది.


2004 నాటి ఫలితాలే 2024లో!

నాటి వాజపేయి ప్రభుత్వం ఐదేళ్లు పూర్తయ్యాక 2004లో ‘భారత్‌ వెలిగిపోతున్నది’ అని తెరపైకి తెచ్చి నాటి ఎన్నికల్లో ప్రచారం చేసింది. బీజేపీ నేతలు చెప్పినట్టు నిజంగానే భారత్‌ వెలిగిపోయి ఉంటే సంక్షేమ పథకాల అవసరం ఉండేది కాదని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. పదేళ్ల మోదీ ప్రభుత్వం రైతులు, పేదల వ్యతిరేక విధానాలు అవలంబించిందని కాబట్టి మోడీ గాని ఆపార్టీ నేతలు 2014, 2019 నాటి ఫలితాలు పునరావృతమవుతాయనుకుంటే భ్రమే అంటున్నారు. నాడు వాజపేయ్‌ ప్రచారం చేసిన భారత్‌ వెలిగిపోలేదు. నేడు కేంద్రం ప్రభుత్వం చెబుతున్నట్టు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అంది భారత్‌ వికసించలేదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2004 నాటి ఫలితాలను 2024లో మోదీ ప్రభుత్వం చవిచూడబోతున్నదని విపక్ష నేతలు బలంగా చెబుతున్నారు.