Vinodhaya Sitham Review | చూస్తే.. టైమ్ లేదనే మాటే ఉండదు.. ‘బ్రో’‌తో బాక్సాఫీస్ బద్దలే!

Vinodhaya Sitham Review | మూవీ పేరు: ‘వినోదయ సిత్తం’ విడుదల: 13 అక్టోబర్, 2021 (Zee5 OTT) నటీనటులు: సముద్రఖని, తంబి రామయ్య, సంచితా శెట్టి, శ్రీరంజని, యువశ్రీ లక్ష్మీ, దీపక్ దినకర్, జయప్రకాశ్ తదితరులు సంగీతం: సి. సత్య సినిమాటోగ్రఫీ: ఎన్.కె. ఏకాంబ్రం కథ: శ్రీవత్సన్ స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్: శ్రీవత్సన్, విజి, సముద్రఖని ఎడిటర్: ఏ.ఎల్. రమేష్ నిర్మాతలు: అభిరామి రామనాథన్, నల్లమ్మై రామనాథన్ దర్శకత్వం: సముద్రఖని కోలీవుడ్‌లో రచయిత, దర్శకుడు, నటుడైన సముద్రఖని […]

  • Publish Date - July 27, 2023 / 07:15 AM IST

Vinodhaya Sitham Review |

మూవీ పేరు: ‘వినోదయ సిత్తం’
విడుదల: 13 అక్టోబర్, 2021 (Zee5 OTT)
నటీనటులు: సముద్రఖని, తంబి రామయ్య, సంచితా శెట్టి, శ్రీరంజని, యువశ్రీ లక్ష్మీ, దీపక్ దినకర్, జయప్రకాశ్ తదితరులు
సంగీతం: సి. సత్య
సినిమాటోగ్రఫీ: ఎన్.కె. ఏకాంబ్రం
కథ: శ్రీవత్సన్
స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్: శ్రీవత్సన్, విజి, సముద్రఖని
ఎడిటర్: ఏ.ఎల్. రమేష్
నిర్మాతలు: అభిరామి రామనాథన్, నల్లమ్మై రామనాథన్
దర్శకత్వం: సముద్రఖని

కోలీవుడ్‌లో రచయిత, దర్శకుడు, నటుడైన సముద్రఖని రూపొందించిన ‘వినోదయ సిత్తం’ సినిమా కరోనా టైమ్‌లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్లలో విడుదల కాకపోయినప్పటికీ.. ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలై మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. టైమ్ ప్రధాన కథాంశంగా రూపొందిన ఈ సినిమా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ కావడంతో దీనిని భారతీయ సినిమాకు చెందిన అన్ని భాషలలో రీమేక్ చేయాలని సముద్రఖని నిర్ణయం తీసుకున్నారు.

అందులో భాగంగా ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో.. తమిళ్‌లో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సముద్రఖనినే తెలుగులోనూ డైరెక్ట్ చేయడానికి పూనుకోవడంతో.. అసలు ‘వినోదయ్య సిత్తం’లో అంత మ్యాటర్ ఏముందా? అని అంతా సెర్చ్ చేయడం మొదలెట్టారు.

జీ5 ఓటీటీలో ఉన్న ఈ సినిమాని చూసి ముందుగానే ఇందులోని విషయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతుండటంతో.. ఆటోమేటిగ్గా ‘వినోదయ్య సిత్తం’ వ్యూవర్‌షిప్ పెరిగిపోతుంది. తెలుగులో ‘బ్రో’ పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా జూలై 28న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఫైనల్‌కి ముందు జరిగే వామప్ మ్యాచ్‌లాగా.. ‘వినోదయ్య సిత్తం’లో ఉన్న మ్యాటరేంటో మన రివ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కథ:

లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో.. నాకిప్పుడు అంత టైమ్ లేదని అనే ఉంటారు. కానీ ఈ కథలో పరశురామ్ (తంబిరామయ్య) 25 ఏళ్లుగా ఓ స్పిన్నింగ్ మిల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ.. ప్రతి పనికి నాకంత టైమ్ లేదంటూ.. జీవితాన్ని అనుభవించడం మానేసి.. కర్తవ్యంలో మునిగిపోతాడు. అతని డ్రీమ్ ఆ కంపెనీకి జనరల్ మేనేజర్ కావడం. ఫ్యామిలీ, పిల్లలు, ఆఖరికి తినే ఫుడ్ విషయంలో కూడా నాకిప్పుడు టైమ్ లేదంటూ.. చేసే వర్క్ కోసం ఒక షెడ్యూల్ విధించుకుని అందులో నడిచెళ్లి పోతుంటాడు. ఆయనకి భార్య, పెళ్లి కావాల్సిన ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉంటారు. వారి విషయంలో కూడా తను చెప్పిందే వేదం అన్నట్లుగా పరశురామ్ పవర్ ప్రదర్శిస్తుంటాడు. అలాంటి పరశురామ్‌కి అనుకోకుండా ఓ యాక్సిడెంట్ జరిగి చనిపోతాడు.

చనిపోయిన తర్వాత పరశురామ్‌కి తన బాధ్యతలు గుర్తుకు వస్తాయి. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేయాలి. భార్యకు ఆపరేషన్ చేయించాలి. కొడుకుకు బాధ్యతలు అప్పగించాలనే థాట్ అప్పుడు వస్తుంది. అలాంటి వ్యక్తికి టైమ్ (సముద్రఖని) అనే దేవుడు దిగొచ్చి ఓ 90 రోజులు చావుని పొడిగిస్తే.. పరశురామ్ ఏం చేశాడు? తను అనుకున్నది సాధించాడా? తను చేయాలనుకున్న పనులను పూర్తి చేశాడా? ఆ పనులలో అతనికి ఎటువంటి అవరోధాలు ఏర్పడ్డాయి. వాటిని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు? అనేది తెలియాలంటే హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిన ఈ సినిమాని చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమాలో పెద్దగా పాత్రలేమీ ఉండవు. ఎక్కువగా సినిమాలో కనిపించేది పరశురామ్ పాత్రలో నటించిన తంబిరామయ్య, టైమ్ పాత్రలో నటించిన సముద్రఖని. తంబిరామయ్య ఫ్యామిలీ, ఫ్రెండ్, ఆఫీస్ అంతే.. మరో కోణం ఏమీ ఉండదు. స్ట్రయిట్‌గా వెళ్లిపోతుంది సినిమా. పరశురామ్‌గా తంబీరామయ్య పాత్ర మొదట్లో కాస్త ఓవర్ అనిపించినా.. తర్వాత్తర్వాత మాత్రం తన నటనతో కట్టిపడేస్తాడు. ఆయన పాత్రలో ఉన్న వెరియస్ ఎమోషన్స్.. చూస్తున్న ప్రేక్షకులను సినిమా థియేటర్‌లో ఉన్నామనే భావన నుంచి నిజ జీవితంలోనే ఉన్నామేమో అనే ఫీల్‌లోకి తీసుకెళతాయి.

పరశురామ్‌తో అందరూ ట్రావెల్ చేస్తారు. టైమ్‌గా సముద్రఖని ఎంటరైనప్పటి నుంచి సినిమా మరో మలుపు తిరుగుతుంది. సముద్రఖని టైమ్ పాత్రలో నార్మల్‌గా కనిపించాడు. దేవుడు ఇంత సింపుల్‌గా ఉంటాడా? అని అనిపిస్తుంది.. ఆయనని ఈ పాత్రలో చూసిన వారికి. ఇంకా తంబిరామయ్య భార్య, కుమార్తెలు, కొడుకు, కోడలు, ఫ్రెండ్, ఫ్రెండ్ కొడుకు పాత్రలలో చేసిన వారంతా వారి పాత్రలకు అతికినట్లుగా సరిపోయారు. వారి నటనతో పాత్రలకు నిండుదనం తెచ్చారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..

ఈ సినిమాకు నిడివి పెద్ద హైలెట్ అని చెప్పుకోవాలి. విరామమే లేకుండా 1 గంట 40 నిమిషాలలో సినిమాని ముగించిన తీరు బాగుంది. ఫ్లో మిస్ కాకుండా.. ఎడిటర్ చక్కని కర్తవ్యం నిర్వహించాడు. అలాగే స్క్రీన్‌ప్లే కూడా చక్కగా కుదిరింది. తమిళ ప్రేక్షకులు డైలాగ్స్ పరంగా అంతగా దృష్టి పెట్టరు కాబట్టి.. వాళ్లకు కావాల్సిన విధంగా.. నార్మల్‌గానే డైలాగ్స్ వెర్షన్ నడిచింది. సముద్రఖని చెప్పే కొన్ని డైలాగ్స్ మాత్రం బాగుంటాయి.

ఈ సినిమాకు ఏది అవసరమో.. ఎంత అవసరమో అంతే మోతాదులో సంగీతం, సినిమాటోగ్రఫీ వంటివి కుదిరాయి. ఆర్ట్ వర్క్‌కు కూడా మంచి మార్కులు పడతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు సముద్రఖని.. తను అనుకున్న చిన్న పాయింట్‌ని సూటిగా చెప్పే ప్రయత్నం చేసి మెప్పించారు. కాకపోతే.. తంబిరామయ్య స్టార్టింగ్ సీన్స్ అంత కనెక్టివ్‌గా అనిపించవు. బహుశా ఇలాంటి వాడి లైఫ్‌తో దేవుడు ఆడుకుంటే ఎలా ఉంటుందని చూపించాలనేది సముద్రఖని అభిప్రాయం కావచ్చు. స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్ పరంగా సముద్రఖని ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.

విశ్లేషణ:

ఇందులో దర్శకుడు సముద్రఖని చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే.. మనిషి జన్మ చాలా గొప్పది. అలాంటి గొప్ప జన్మను పొందిన మనిషి.. ప్రజంట్ ఎలా బతకాలనేది చూడకుండా.. ఫ్యూచర్ కోసం పరుగులు తీస్తూ తనని తానే మోసం చేసుకుంటున్నాడని. అందుకు ఆయన పరశురామ్ పాత్రని క్రియేట్ చేసి.. ఆయనకు అన్ని వసతులు కల్పించినా.. అతనికి సంతోషం అనేది ఉండదు.

ఇంకా పైకి వెళ్లాలి అనే భావనతో కుటుంబ బాధ్యతలను కూడా పట్టించుకోడు. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత స్వర్గానికి తీసుకెళుతున్నానని టైమ్ చెబితే.. మరి నరకం అంటే ఏమిటి? అని పరశురామ్ అడుగుతాడు. నరకం అంటే.. ఒకే ఒక్క మాటతో ఆయన ఇచ్చిన సమాధానం.. ఒక్కసారిగా నిజమే కదా అని అనిపిస్తుంది. ‘ఇప్పుడు అక్కడి నుంచే కదా నిన్ను తీసుకెళుతుంది?’ అనే ఒక్క మాటతో మనిషి భావజాలన్ని దర్శకుడు తెలియజేశాడు.

ఇంకో 90 రోజులు నీకు టైమ్ ఇస్తున్నా.. ఈలోపు నీవు నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నింటినీ నిర్వర్తించమని టైమ్ చెప్పగా.. అప్పుడు ఎదురయ్యే ట్విస్ట్‌లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒక కూతురు ప్రేమ, మరో కూతురి చదువు, కొడుకుకు అమెరికాలో జాబ్ పోవడంతో పాటు అక్కడ సహజీవనం చేస్తున్న అమ్మాయిని తీసుకుని ఇండియాకి రావడం, మరో వైపు భార్య ఆరోగ్య సమస్య, ఆఫీస్‌లో GM పోస్ట్ వేరొకరికి ఇవ్వడం.. ఇలా మొత్తంగా పరశురామ్‌ని ప్రాబ్లమ్స్ ఆవహించగా.. ఆయన ప్రజంట్ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి.. అన్నీ సమస్యలని సాల్వ్ చేసుకోగలుగుతాడు.

అదే ఫ్యూచర్ కోసం పరుగులు తీసినప్పుడు లేని ఆనందం.. ప్రజంట్‌లో అందరి బాధ్యతలు నెరవేర్చి.. అందరి కళ్లలో సంతోషం చూసినప్పుడు ఆయన పొందే ఆనందం అంతా ఇంతా కాదు. అదే ‘వినోదయ్య సిత్తం’. ఇందులో మరో కోణాన్ని కూడా చర్చించడం సినిమా చూసే వారికి గొప్ప ఫీల్‌ని ఇస్తుంది. కర్మకు అందరూ బాధ్యులే అని చెప్పే క్రమంలో పరశురామ్ గతంలో చేసిన కొన్ని మిస్టేక్స్‌ని సరిచేసిన క్రమం కూడా అందరినీ ఆలోచింపజేస్తుంది.

లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ అనేది భగవంతుడు ప్రసాదిస్తే.. అప్పటి వరకు అసలైన జీవితం తెలుసుకోలేక పోయిన పరశురామ్.. ఆ సెకండ్ ఛాన్స్‌లో తనకు దక్కిన కేవలం మూడు నెలల టైమ్‌లో ఎలా జీవితం గురించి తెలుసుకున్నాడనేదే ఈ ‘వినోదయ్య సిత్తం’. వాస్త‌వానికి, భ్ర‌మ‌కు మ‌ధ్య ఉన్న తేడాని తెలుసుకు న్న‌ప్పుడే నిజ‌మైన జీవితం విలువ తెలుస్తుందని సింపుల్‌గా, సహజంగా ఇందులో ఆవిష్క‌రించారు.

చదువు, ఉద్యోగాల విష‌యంలో త‌ల్లిదండ్రులు.. పిల్లలపై పెడుతున్న భారం వల్ల వారు ఎలాంటి సంఘర్షణకు లోనవుతారనే విషయాన్ని చిన్న కుమార్తె రూపంలో చాలా చక్కగా దర్శకుడు తెర రూపమిచ్చాడు. మొత్తంగా అయితే.. జీవితపు విలువ‌ను చాటుతూ ‘వినోదయ్య సిత్తం’ సినిమా చివరకు అర్థ‌వంతంగా ముగుస్తుంది. కాకపోతే.. 90 డేస్ టైమే ఉందని తెలిసిన తర్వాత కూడా.. పరశురామ్ ప్రవర్తనలో కొన్ని రోజుల పాటు అదే ప్రవర్తన కంటిన్యూ అవడం అనేది కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

మొత్తంగా అయితే ఓ మంచి సినిమా చూశామనే ఫీల్‌ని, ఓ మంచి మెసేజ్‌ని ఈ సినిమా ఇస్తుంది. ఈ సినిమా తెలుగు నెటివిటీకి ఎలాంటి మార్పులు చేశారనే ఆసక్తితో పాటు.., త్రివిక్రమ్ అందించే స్ర్కీన్‌ప్లే, మాటలు.. స్టార్ క్యాస్ట్ తోడయ్యారు కాబట్టి.. తమిళ్ కంటే కూడా తెలుగులో బాగా వర్కవుట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. చూద్దాం.. ఇంకొన్ని గంటలలో ‘బ్రో’ భవితవ్యం. ఈ వినోదయ సిత్తం సినిమా జీ5 ఓటీటీలో తెలుగు వర్షన్‌లోనూ ఉన్నది ఆసక్తి ఉన్నవారు బ్రో విడుదలకు ముందే చూసేయండి.

ట్యాగ్‌లైన్: చూస్తే.. టైమ్ లేదనే మాటే ఉండదు
రేటింగ్: 3/5

Latest News