విధాత: సుయ్.. అంటే చాలు.. నాకొక అట్టు అన్నట్లు తయారైంది సమాజం. నిన్న కేసీఆర్ జాతీయ పార్టీ బీఆరెస్‌ను ప్రారంభించారో లేదో అప్పుడే పొరుగునున్న ఆంధ్రాలో కేసీఆర్, కేటీఆర్‌లతో కూడిన ఫ్లెక్సీలు రెడీ అయిపోయాయి. సాధ్యమైనన్ని ఎక్కువ రాష్ట్రాలు అది కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలుండే చోట్ల పోటీ చేసి తన అస్థిత్వాన్ని రుజువు చేసుకునేందుకు కేసీఆర్ తాపత్రయ పడుతున్నారు.
ఈ క్రమంలోనే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఇంకా వీలును బట్టి చత్తీస్‌గడ్ వంటి రాష్ట్రాల్లో తమ ఉనికి ఉండాలని కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తమతో కలిసి వచ్చే నేతలతో మాట్లాడుతూ ఆ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఆంధ్రాలో అయితే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటివాళ్లు కేసీఆర్‌తో టచ్ లో ఉన్నారు.
అయితే ఉండవల్లి ఈ బీఆరెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తారా.. ఊరకనే టీవీల్లో మాట్లాడడం వరకేనా అన్నది తెలీడం లేదు. గెలుపోటములు సంగతి పక్కనబెడితే కేసీఆర్ పట్ల ఏపీలో కొంత సానుకూలత అయితే ఉందన్నది సుస్పష్టం. దాన్ని మరింత పదిపరచుకునేందుకు ఆయన ఏపీలో భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
అనంతపురం జిల్లాలో ఆయన లక్షమందితో భారీ సభ పెడతారని ఆలోచన. అలా అయితే అటు రాయల సీమతో బాటు పక్కనే ఉన్న కర్ణాటకకు సైతం తన ఉనికిని చాటినట్లు అవుతుంది. రాయలసీమలోని పలువురు నాయకులతో కేసీఆర్‌కు సాన్నిహిత్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీ సభను నిర్వహించి, మెల్లగా పార్టీని మరింత విస్తృతం చేస్తారని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఆ ఫ్లెక్సీలకు సమాధానం అన్నట్లుగా తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ విజయ వాడలో బీఆరెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని, పార్టీని ఏపీలో బలోపేతం చేస్తామని అన్నారు. ఆయన ఈనెల 18,19 తేదీల్లో విజయవాడలో పర్యటించి పార్టీ కార్యాలయం ఏర్పాటు వంటి పనులు పర్యవేక్షిస్తారని సమాచారం.