Building Collapses | కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు.. మృతుల సంఖ్య భారీగా ఉండే ఛాన్స్..!

  • Publish Date - March 18, 2024 / 04:51 AM IST

Building Collapses: కోల్‌కతాలో ఘోర భవన ప్రమాదం జరిగింది. ఆదివారం అర్థరాత్రి నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. దాంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్‌ సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికితీశాయి. మరో 14 మందిని ప్రాణాలతో బయటికి తీసుకొచ్చాయి. వారిని వెంటవెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.

గార్డెన్ రీచ్ ప్రాంతంలోని హజారీ మొల్లా బగన్‌లో అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్స్‌తో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. భవన శిథిలాలు చుట్టుపక్కల ఇళ్లపై కూడా పడటంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు 14 మందిని ప్రాణాలతో బయటికి తీశారు. రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భవన శిథిలాలు పక్కనే ఉన్న గుడిసెలపై సైతం పడ్డాయని.. ఆ సమయంలో గుడిసెల్లో ఎంత మంది ఉన్నారో తెలియాల్సి ఉందని అన్నారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఘటనపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 

Latest News