Deaths by drowning | వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే( World drowning Prevention Day ) సందర్భంగా చైల్డ్ ఇన్ నీడ్ ఇన్‌స్టిట్యూట్ అనే ఎన్జీవో సంస్థ, జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ కలిసి నిర్వహించిన సర్వేను కోల్‌కతాలో శుక్రవారం విడుదల చేశారు. ఈ సర్వేలో వెస్ట్ బెంగాల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా భాగస్వామ్యం అయింది.
18 మిలియన్ల జనాభా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఒక్క ఏడాదిలోనే 9 వేల మంది నీట మునిగి( Deaths by drowning ) చనిపోయినట్లు సర్వేలో వెల్లడైంది. అంటే రోజుకు సగటున 25 మంది చనిపోయినట్లు తేలింది. ఇందులో పిల్లలే అత్యధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరుచూ జరుగుతున్న నేపథ్యంలో వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది.
గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోగా, ఇందులో 18 శాతం ఇండియా నుంచి ఉన్నారు. ఈ 18 శాతంలో కేవలం బెంగాల్ నుంచి 17 శాతం మరణాలు ఉన్నాయి. ఈ సర్వేను మార్చి 2024 నుంచి అదే ఏడాది డిసెంబర్ చివరి వరకు నిర్వహించినట్లు పేర్కొన్నారు. నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఏడాది నుంచి నాలుగేండ్ల వయసు ఉన్న వారే అధికంగా ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ పొలాల్లో తమ తల్లిదండ్రులు పని చేసుకుంటున్న క్రమంలో పిల్లలు అక్కడే ఉన్న చెరువులు, కుంటలు, బావుల్లో స్నానాలు చేస్తూ, ఈత కొడుతూ, ఆడుకుంటూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారణ అయిందన్నారు. ముఖ్యంగా మధ్యాహ్న 12 నుంచి 2 గంటల మధ్యనే ఇలాంటి ఘటనలు అధికంగా చోటు చేసుకున్నట్లు తమ సర్వేలో వెల్లడి అయిందన్నారు.
ఈ క్రమంలో చెరువులు, కుంటలు, బావుల చుట్టూ ప్రత్యేక ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారులు పేర్కొన్నారు. పిల్లల మొబిలిటీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని చెరువులు, బావుల వద్ద ప్రత్యేక ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లల మరణాలు ఆందోళన కలిగిస్తుందని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎన్జీవోలు కోరుతున్నాయి.