Monalisa | కుంభమేళాలో సాధారణ అమ్మాయిగా పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా, ఆ తర్వాత సినీ అవకాశాలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా మోనాలిసా కేరళలో తన ప్రేమికుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ వివాహానికి ఇరు కుటుంబాల నుంచి వ్యతిరేకత రావడంతో మోనాలిసా తన ప్రేమికుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి కేరళలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం భద్రత కోసం ఇద్దరూ పోలీసులను ఆశ్రయించినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామంతో మోనాలిసా పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
మోనాలిసా మొదటగా కుంభమేళాలో పూసలు అమ్ముతూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెను సినీ రంగంలోకి తీసుకువచ్చి హీరోయిన్‌గా పరిచయం చేయాలని ప్రయత్నించారు. అయితే సనోజ్ మిశ్రాపై పలు ఆరోపణలు రావడంతో ఆయన జైలుకు వెళ్లడం జరిగింది. దీంతో ఆయన దర్శకత్వంలో ప్రారంభమైన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత మోనాలిసా హిందీతో పాటు తెలుగు సినిమాల్లో కూడా హీరోయిన్‌గా రెండు ప్రాజెక్టులకు అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె సినీ కెరీర్ ప్రారంభమవుతుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి.
ఇటీవల జరిగిన ఆమె వివాహంపై సనోజ్ మిశ్రా సోషల్ మీడియాలో స్పందిస్తూ భావోద్వేగపూరితమైన పోస్టు పెట్టారు. మోనాలిసా ఈ వివాహాన్ని ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనై చేసుకుందని ఆయన ఆరోపించారు. ఇది సాధారణ ప్రేమ వివాహం కాదని, ‘లవ్ జీహాద్’లో భాగమని ఆయన వ్యాఖ్యానించారు. తాను మోనాలిసాకు శిక్షణ ఇచ్చి సినీ పరిశ్రమలోకి తీసుకువచ్చానని, ఇప్పుడు జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని అన్నారు.అంతేకాకుండా మోనాలిసా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా ఆయన వెల్లడించారు. ఆమె కుటుంబంలో సమస్యలు ఉన్నాయని, తండ్రి తల్లిని వదిలి మరో వివాహం చేసుకున్నారని చెప్పారు. ఆ విషయాల వల్ల మోనాలిసా చాలా బాధపడుతుందని తనతో పంచుకుందని తెలిపారు.
ఇక తన దగ్గర పనిచేసిన ఓ వ్యక్తి మోనాలిసా మేనేజర్‌గా మారి ఆమెను తప్పుదోవ పట్టించాడని కూడా సనోజ్ మిశ్రా ఆరోపించారు. అదే వ్యక్తి ఆమెతో దక్షిణాది సినిమాలకు ఒప్పందాలు చేయించాడని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మోనాలిసా వివాహాన్ని కేరళలోని కొన్ని రాజకీయ వర్గాలు, కమ్యూనిస్టు నేతలు ప్రస్తావిస్తూ ఉండడంతో ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. అయితే ఈ వివాదాలపై మోనాలిసా లేదా ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. వారు ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
