Site icon vidhaatha

actor humiliated publicly । ఒళ్లో కూర్చొనాలని దర్శకుడు బలవంతం చేశాడు.. అందరి ముందు ముద్దు పెట్టాడు: బెంగాలీ నటి ఆరోపణ

actor humiliated publicly । సినిమా షూటింగ్‌ సమయంలో దర్శకుడు అరిందమ్‌ సిల్‌ తన అనుమతి లేకుండా బహిరంగంగా తనను ముద్దుపెట్టుకున్నాడని బెంగాలీ నటి ఒకరు ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇటీవల కోల్‌కతాలో చోటు చేసుకున్న మెడికోపై దారుణం కేసులో ‘రీక్లయిమ్‌ ది నైట్‌’ ఆందోళనలో పాల్గొనటం చూసి తాను విస్తుపోయానని తెలిపారు. ‘తనను బహిరంగంగా అవమానానికి గురి చేశారని, అందుకు తనకు బహిరంగంగా లిఖితపూర్వకంగా ఆయన క్షమాపణ చెప్పాలంటూ ఒక నటి తమకు ఫిర్యాదు చేశారని  పశ్చిమ బెంగాల్‌ మహిళా కమిషన్‌  (WBCW) చైర్‌పర్సన్‌ లీనా గంగోపాధ్యాయ చెప్పారని టాయ్‌ తెలిపింది. ముద్దు పెట్టుకోవడం ఇష్టమేనా అంటూ సిల్‌ రెట్టించి అడిగాడని ఆమె పేర్కొన్నారు. అయితే దర్శకుడు సిల్‌ మాత్రం తనకేమీ  గుర్తులేదని చెబుతున్నారు. తన అంతరాత్మ పరిశుద్ధంగా ఉన్నదని చెప్పారు. ‘ఉద్దేశపూర్వకంగా నేనేమీ చేయలేదు. ఒకవేళ చెడుగా ప్రవర్తించానని ఆమె బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా. ఈ విషయంలో న్యాయపరమైన సలహా కోసం చూస్తున్నాను. మిగిలింది కాలానికే వదిలిపెడుతున్నా’ అని చెప్పారు.

ఈ ఘటన ‘ఏక్తి ఖునిర్‌ సంధానే మితిన్‌’ చిత్రం సెట్స్‌లో  ఏప్రిల్‌ 3న చోటుచేసుకున్నట్టు నటి ఆరోపించారు. ‘మొదట నన్ను ఆయన ఒళ్లో కూర్చోవాలని బలవంతం చేశాడు. నేను ఒప్పుకోలేదు. దాంతో వచ్చి కూర్చోవాలని గద్దిస్తూ ఆదేశించాడు. అంత భయపెట్టేసరికి ఏం చేయాలో పాలుపోలేదు. నేను ఆయన ఒళ్లో కూర్చొన్న తర్వాత నా బుగ్గలపై ముద్దు పెట్టాడు. నేను షాక్‌ తిన్నాను. కానీ.. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే లేచి వెళ్లిపోయాను. అసలేమీ జరగలేదన్నట్టు నాటకాలేశాడు. అదేదో జోక్‌ అన్నట్టు చుట్టూ ఉన్నవారు నవ్వుతూ ఉండిపోయారు.  ఆయన మానిటర్‌ ముందు నుంచి వచ్చేసిన తర్వాత ఈ విషయాన్ని నేను అడిగాను. దాంతో ఆయన ‘నీకు నచ్చలేదా?’ అని ఎదురు ప్రశ్నించాడు’ అని నటి తెలిపారు. ఈ విషయంలో తనకు బహిరంగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేశారు. మీడియాను తప్పుదారి పట్టించేందుకే యాదృచ్ఛికంగా ముద్దు పెట్టానని చెబుతున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో తాను కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు.

ఆ ఘటన జరిగిన తర్వాత నిర్మాతలకు విషయం చెబితే.. తన భద్రత కోసం సెట్స్‌ వద్ద ఎవరినైనా పెడతామని హామీ ఇచ్చారని, ఆ తర్వాతే తాను మళ్లీ షూటింగ్‌కు వచ్చానని తెలిపారు. అదొక భయానక అనుభవమని పేర్కొన్నారు. మిగిలినవారికి ఇబ్బంది అవుతుందనే తాను షూటింగ్‌ కొనసాగించానని తెలిపారని టాయ్‌ పేర్కొన్నది.

Exit mobile version