అమెరికాలో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం.. జో బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొట్టిన కారు

అగ్ర‌రాజ్యం అమెరికాలో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని ఓ వాహ‌నాన్ని ఓ ప్ర‌యివేటు కారు ఢీకొట్టింది.

  • Publish Date - December 18, 2023 / 05:30 AM IST

విధాత‌: అగ్ర‌రాజ్యం అమెరికాలో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని ఓ వాహ‌నాన్ని ఓ ప్ర‌యివేటు కారు ఢీకొట్టింది. దీంతో అమెరికా పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ఆ కారు డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.


అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఆయ‌న స‌తీమ‌ణి జిల్ క‌లిసి ఆదివారం రాత్రి డెలావ‌ర్‌లోని త‌మ పార్టీ ప్ర‌చార కార్యాల‌యానికి వెళ్లారు. అక్క‌డ డిన్న‌ర్ ముగించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో బైడెన్ కాన్వాయ్‌లోని యూఎస్ సీక్రెట్ స‌ర్వీస్ వాహనాన్ని గుర్తు తెలియ‌ని కారు ఢీకొట్టింది. ఆ కారు మ‌రో వాహ‌నంపైకి దూసుకెళ్లేందుకు య‌త్నించ‌గా, పోలీసులు అడ్డుకున్నారు.


అయితే ఈ ఘ‌ట‌న స‌మ‌యంలో జిల్ అధ్య‌క్ష వాహ‌నంలో కూర్చొని ఉండ‌గా, బైడెన్ బ‌య‌ట ఉన్నారు. ఘ‌ట‌నాస్థ‌లానికి 130 అడుగుల దూరంలో ఉన్న బెడైన్‌ను త‌క్ష‌ణ‌మే అధ్య‌క్ష వాహ‌నంలోకి తీసుకెళ్లి కూర్చొబెట్టారు. అనంత‌రం బైడెన్ దంప‌తుల‌ను వైట్ హౌస్‌కు త‌ర‌లించారు. జో బైడెన్, జిల్ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఇక బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొట్టిన కారు డ్రైవ‌ర్‌ను సీక్రెట్ స‌ర్వీస్ సిబ్బంది అరెస్టు చేశారు. కారును సీజ్ చేశారు. పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.