విధాత: ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా ఎదిగిందని టీఆర్‌ఎస్ వర్గాలు సంబురాలు జరుపుకొంటున్న వేళ.. కల్వకుంట్ల కవిత ఇంటికి సీబీఐ అధికారులు రాబోతున్న విషయం ప్రకంపనలు పుట్టిస్తున్నది. ఆదివారం ఉదయం 11 గంటలకు కవిత ఇంటికి చేరుకోనున్న సీబీఐ అధికారులు ఎలాంటి ప్రశ్నాపత్రంతో వస్తున్నారోనన్నది టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతన్నది. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్‌కు చేరుకున్నది. సరిగ్గా ఈసమయంలోనే ప్రగతి భవన్‌లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతుండటం గమనార్హం.
రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న సీబీఐ విచారణ
సీబీఐ చేపట్టిన ఈ విచారణ పర్వం.. ప్రశ్నలు, వివరణల దగ్గరే ఆగుతుందా.. లేదా అరెస్టు దాకా పోతుందా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నది. సీబీఐ విచారణ తతంగం అంతా ఓ ప్రత్యేక స్టైల్. ఎవరికీ అంతుబట్టదు. సాధారణంగా సీబీఐ మొదట విచారణ పేరిట కొన్ని ప్రశ్నలతో మొదలు పెట్టి గంటలు, రోజుల తరబడి విచారిస్తారు. చివరకు నిర్దిష్టమైన రుజువులు దొరికితే అదుపులోకి తీసుకొంటున్నామని చావు కబురు చల్లగా చెప్తారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రితో ఆరంభమై..
ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ దాంట్లో తెలంగాణ లింకులు బయటపడుతూనే ఉన్నాయి. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో మొదలైన విచారణ పర్వం ఇప్పటి దాకా 14 మందికి చేరుకున్నది. ఆ క్రమంలోనే సీఎం కేసీఆర్ కూతురు కవిత పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేరింది.
రేపే కల్వకుంట్ల కవిత ఇంట్లో సీబీఐ విచారణ
దీంతో తమ ముందు హాజరు కావాలని సీబీఐ అధికారులు కవితను లిఖిత పూర్వకంగా కోరటంతో మొదట డిసెంబర్ 6న హాజరవుతానని తెలిపింది. తీరా ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 5న తనకు ఆరోగ్యం బాగాలేనందున హజరయ్యేందుకు సమయం ఇవ్వాలని, తాను డిసెంబర్ 11 నుంచి 16 దాకా అందుబాటులో ఉంటానని తెలిపింది.
దాంతో సీబీఐ అధికారులు డిసెంబర్ 11న ఉదయం 11 గంటలకు ఇంట్లో అందుబాటులో ఉండాలని కవితను కోరగా, ఆ మేరకు కవిత కూడా సమ్మతి తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం కవిత సీబీఐ ముందు విచారణకు హాజరు కానున్నది.