విధాత: గిరిజనులకు ఇప్పుడు ఇస్తున్న రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇలా రిజర్వేషన్ల శాతాన్ని పెంచడాన్ని చట్టం ఒప్పుకోదని స్పష్టం చేసింది. ఇలా గిరిజనులకు అపారమైన మేలు చేసి వారి మద్దతు పొందాలని, మళ్ళొక్కసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ ఎత్తులు పారకుండా కేంద్రం అడ్డుపుల్ల వేసింది.
రాష్ట్రంలో చాన్నాళ్ళ నాటి డిమాండ్ అయిన ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ఇప్పట్లో తేల్చేది లేదని కేంద్రం చెప్పింది. ఈ అంశం ఇప్పట్లో తేల్చలేమని.. దీనికి చాలా సమయం పడుతుందని కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
దీనిని ఆమోదించాలంటూ..కేంద్ర హోం శాఖకు పంపించింది. అయితే కేంద్రం ఏమీ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంభించింది. దీంతో ఈ విషయం తాజాగా.. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు ప్రస్తావించారు. తాము ప్రతిపాదించిన ఎస్టీ రిజర్వేషన్ల అంశాన్ని ఏం చేశారంటూ.. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇంకెంత కాలం పడుతుందని నిలదీశారు.
దీనిపై స్పందించిన కేంద్రం.. ఇప్పటికే అనేక రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచుతూ పోతున్నాయని దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో అనేక కేసులు ఉన్నాయని.. అవి పరిష్కారం అయిన తర్వాతే తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలంగాణ ఎంపీకి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంపునకు సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందిందన్నారు. ప్రస్తుతం గిరిజనులకు ఇస్తున్న రిజర్వేషన్ల కోటాను 6 శాతం నుంచి10 శాతానికి వరకు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోం శాఖకు చేరిందన్నారు.
దీంతో రాష్ట్రంలోని మొత్తం రిజర్వేషన్ల శాతం 54 శాతానికి చేరింది. వాస్తవానికి ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్ల శాతం 50కి మించారదనేది గతంలోనే సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచుకుంటూ ఓటు బ్యాంకును పదిలం చేసుకుంటున్నాయి.
అయితే ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయని న్యాయస్థానంలో కేసుల పరిష్కారం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే దీనిపై ముందుకు వెళ్లాలని నిర్ణయించామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అయితే సుప్రీంకోర్టులో కేసులు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.